పవన్ కు మొదలైపోయింది… కోర్టుకు వెళ్లేది ఎప్పుడంటే…?

పవన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందా.. పవన్ కోర్టు మెట్టులు ఎక్కడం తప్పదా.. ఈ విషయంలో వాలంటీర్లు పట్టు వదలడం లేదా.. అంటే అవుననే తెలుస్తోంది. ఇందులో భాగంగా పవన్ వ్యాఖ్యల పట్ల తాను మానసికంగా తీవ్ర ఆవేదనకు గురైనట్లు.. చుట్టుపక్కల వాళ్ల మాటలవల్ల మరింత ఇబ్బంది పడినట్లు ఒక మహిళా వాలంటీర్ కోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసును న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.

అవును… జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓ మహిళా వాలంటీర్‌.. విజయవాడ సివిల్‌ కోర్టులో పవన్‌ పై డిఫమేషన్‌ కేసు వేశారు. ఈ సందర్బంగా తమపై పవన్‌ అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురైనట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. దీంతో వాలంటీర్‌ ఇచ్చిన కేసును న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.

అయితే… ప‌వ‌న్ అనుచిత వ్యాఖ్య‌ల‌ను అడ్డు పెట్టుకుని అధికార వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వాలంటీర్ల‌కు అండ‌గా నిలుస్తూ, ప‌వ‌న్‌ పై న్యాయ‌పోరాటానికి ప్రోత్స‌హించింది. దీంతో మహిళా వలంటీర్‌ తరఫున న్యాయవాదులు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం పవన్ పై కేసు దాఖలు చేశారు. పవన్‌ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అనంతరం.. న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురైంది.. కోర్టును ఆశ్రయించిన తర్వాత, ఆ కేసును న్యాయమూర్తి స్వీకరించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుంది.. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్‌ కు కోర్టు నోటీసులు ఇస్తుంది. అనంతరం.. పవన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో… పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయని.. వాలంటీర్లలో అధిక శాతం మహిళలు ఉన్నారన్న విషయం పవన్ మరిచారని.. ఉమెన్‌ ట్రాఫికింగ్‌ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్‌ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలు కోర్టుకు వెల్లడించాలని.. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

అనంతరం బాధిత వాలంటీర్ మీడియాతో మాట్లాడారు… పవన్ వ్యాఖ్యలు తనను బాధించాయని.. ఆయన తప్పుడు ఆరోపణలు చేశారని.. ఉమెన్‌ ట్రాఫికింగ్ ఆరోపణలు అవాస్తవమని.. భర్త చనిపోయిన తాను ఒంటరిగా పిల్లలతో జీవిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదే సమయంలో పవన్ వ్యాఖ్యల తర్వాత తనను చుట్టుపక్కల వారు ప్రశ్నించారరని.. ఆ ప్రశ్నలు తనను వేధించాయని తెలిపారు.

దీంతో.. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కోర్టు మెట్లు ఎక్కడం తప్పదని అంటున్నారు న్యాయ నిపుణులు. పైగా ఇదొక్కటే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని కేసులు వేస్తారో అనే అనుమానాన్ని రేకెత్తిస్తున్నారు. అదే జరిగితే ఇక నెలలో సగం రోజులు పవన్ కోర్ట్ల చుట్టూ తిరగాల్సి ఉన్నా అతిశయోక్తి కాదని అంటున్నారట.

ఇదే సమయంలో… వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యల్లో నిజానిజాలు పవన్ కు తెలుసు కాబట్టి… అవి నిజంగా వాస్తవాలు అయితే పర్లేదు. అందుకు సంబంధించిన నివేదికలు కేంద్ర నిఘా వర్గాలనుంచి తెప్పించుకుని కోర్టుకి సబ్ మిట్ చేసెయ్యొచ్చు. పైగా మోడీ, అమిత్ షా లు తనకు క్లోజ్ అని పవన్ చెబుతుంటారు కాబట్టి అది పెద్ద విషయం కాకపోవచ్చు.

కానీ అవి అవాస్తవాలని, కేవలం బురదజల్లుడులో భాగంగా చేసినట్లు పవన్ భావిస్తుంటే… అప్పుడు ఆ వ్యాఖ్యలను ఎలా స‌మ‌ర్థించుకుంటారో వేచి చూడాలి. మరోపక్క ఈ విషయాల పట్ల కోర్టు మరెంత సీరియస్ గా రియాక్ట్ అవుతాదనేది కూడా ఆసక్తిగా మారిందని అంటున్నారు.