ఏపీలోని ప్రధాన పార్టీల అధినేతలైన జగన్ కు పులివెందుల నియోజకవర్గం ఫిక్స్డ్ గా ఉంది. ఇక తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని వదిలిన చంద్రబాబు.. కుప్పంలో ఫిక్స్ అయిపోయారు! అయితే… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం సొంత నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది. అయితే ఈసారి ఒక నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకుని.. ఆ నియోజకవర్గంలో గెలిస్తే.. ఇక దాన్నే స్థిరంగా పెట్టుకోవాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో తిరుపతి పేరు కూడా తెరపైకి వచ్చింది.
అవును… గత ఎన్నికల్లో సొంత జిల్లా భీమవరం నుంచి, ఉత్తరాంధ్ర జిల్లా గాజువాక నుంచి పోటీచేసిన పవన్ కు రెండుచోట్లా పరాభవం తప్పలేదు. ఈ సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా రెండూ నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం లేదు. దీంతో… కచ్చితంగా గెలిచే అవకాశం (సామాజిక సమీకరణల ఆధారంగా) ఉన్న నియోజకవర్గాలపై పవన్ దృష్టి సారించి, సర్వేలు చేసుకుంటున్నారని అంటున్నారు.
ఈ సమయంలో పవన్.. తిరుపతిలో పోటీ గురించి కూడా ఆలోచిస్తున్నరని అంటున్నారు. ప్రజారాజ్యం సమయంలో కూడా సొంత జిల్లాలోని పాలకొల్లు నుంచి చిరు పోటీచేసినా.. పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తిరుపతి నుంచి మాత్రం చిరు గెలిచారు. దీంతో… ఇదే సూత్రాన్ని ఫాలో అవ్వాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు.
ఇందులో భాగంగా… సొంత జిల్లా భీమవరంలో ప్రజలు తిరస్కరించినా.. ఈసారి తిరుపతిని నమ్ముకుంటే బెటరనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అందుకు ప్రధాన కారణం కేస్ట్ ఈక్వేషన్స్. తిరుపతిలో 2.91 లక్షల ఓటర్లు ఉండగా.. వారిలో బలిజ సామాజికవర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఈ ధైర్యమే పవన్ ను తిరుపతివైపు చూసేలా చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.
ఇక ఇక్కడ పవన్ పోటీచేస్తే ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భుమన అభినవ్ రెడ్డి ఉన్నారు. తన తండ్రి ఎమ్మెల్యే అయినప్పటికీ… తిరుపతి నియోజకవర్గంలో అన్నీ తానై అన్నట్లుగా అభినవ్ రెడ్డి అల్లుకుపోతున్నారు. ఇప్పటికే కేడర్ ను పూర్తిగా తనవైపు తిప్పుకున్నట్లు చెబుతున్నారు. కేస్ట్ ఈక్వేషన్స్ ని దాటి తన గెలుపు కన్ ఫాం అనే స్థాయిలో ఆయన నమ్మకంగా చెబుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… పవన్ తిరుపతిలో పోటీచేసి గెలిస్తే సరే కానీ… తొలిసారి పోటీచేస్తున్న యువకుడు అభినవ్ రెడ్డి చేతిలో ఓడిపోతే ఆ తర్వాత జరిగే పరిణామలు ఎల ఉంటాయనేది తెలిసిన విషయమే. గట్టిగా చెప్పాలంటే… అక్కడితో పవన్ పొలిటికల్ కెరీర్ ఆల్ మోస్ట్ క్లోజ్ అనే కామెంట్లు వినిపించినా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితుల్లో తిరుపతి విషయంలో పవన్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని అంటున్నారు.
ఏది ఏమైనా… అభ్యర్థుల ఎంపిక విషయంతో పాటు తాను పోటీ చేసే విషయంలోనూ పవన్ వీలైనంత తొందరగా క్లారిటీకి రాకుండా.. కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లను మాత్రమే నమ్ముకుని ఓవర్ కాన్ఫిడెన్స్ తో రంగంలోకి దిగితే మాత్రం ఎదురుదెబ్బలు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా… టీడీపీతో జనసేన కలయిక అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ ఏర్పాటూ చేస్తామన్న బహిరంగ సభలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి!!