తెలంగాణ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పోటీ నుంచి తప్పుకోవడం.. టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ కు మద్దతు పలికేలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం చేశారని.. ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో కీలక భూమిక పోషించారని.. దీంతో కేసీఆర్ కు రిటన్ గిఫ్ట్ ఇచ్చారని టీడీపీ సోషల్ మీడియాలో టాపిక్స్ వైరల్ అవుతున్నాయి! దీంతో ఏపీ టీడీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా ప్రధానంగా సీట్ల సర్ధుబాట్లకు సంబంధించిన చర్చ జరిగిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్.. జనసేనకు కేటాయించే సీట్లపై క్లారిటీ ఇవ్వాలని, ఫలితంగా నాయకులకు, కేడర్ కు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇవ్వగలుగుతానని చెప్పినట్లు తెలుస్తుంది.
ఇందులో భాగంగా గతంలో ఒక్కో లోక్ సభ స్థానానికీ రెండు సీట్లు చొప్పున మొత్తం 50 స్థానాలు అడిగినట్లు చెబుతున్నా పరిస్థితుల్లో తాజాగా కనీసం 30 అయినా ఇవ్వమని బాబుని రిక్వస్ట్ చేసినట్లు చెబుతున్నారు. అయితే టీడీపీ మాత్రం 25 సీట్ల వరకూ ఇవ్వడానికి కాస్త ప్రిపేర్ గా ఉండేదని.. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ లెక్క బక్క చిక్కుతుందని చెబుతున్నారు.
ఈ సమయంలో సమన్వయ కమిటీల్లో ఈ సీట్ల విషయంపై తీవ్ర చర్చ జరిగిన వేళ… సీట్ల సర్ధుబాట్లపై పవన్… చంద్రబాబుని రిక్వస్ట్ చేశారని చెబుతున్నారు. అయితే ఈ వీషయాలపై స్పందించిన బాబు… ప్రస్తుతం రెండు పార్టీల పొత్తు విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని.. ఆ తర్వాత టికెట్ల సంగతి చూద్దామని సున్నితంగా చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో… వ్యవహారం మొదటికి వచ్చిందనే కామెంట్లు జనసేన నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు.
అయితే చంద్రబాబు ఈ విషయంలో కాస్త గట్టిగా ఉండటంతో పాటు.. ప్రజల్లోకి ఈ పొత్తు ఔనత్యాన్ని, అవసరాన్ని, అందుకు ఇరు పార్టీల కార్యకర్తలతో పాటు ప్రజల అంగీకారాన్ని తెలుసుకోకుండా ముందుకు వెళ్లడం సరైంది కాదని భావిస్తున్నారని తెలుస్తుంది. దీంతో… పొత్తులో ఏమైనా తేడా వచ్చే అవకాశం కూడా ఉందా అనే చర్చ టీడీపీ శ్రేణుల్లో నడుస్తుంది.
పైగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కీలక నేత అయిన నేపథ్యంలో… “ఇండియా” కూటమిలో టీడీపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనేది ఆసక్తిగా మారింది. అదే జరిగితే ప్రస్తుతానికి ఎన్డీయే కూటమిలో ఉన్నట్లు చెబుతున్న జనసేనకు కాంగ్రెస్ – టీడీపీల కలయికతో కలిసే ఛాన్స్ లేదని అంటున్నారు. దీంతో… బాబు కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.