సోలో ఫైట్‌కి సిద్ధమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

2024 ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి వెళ్ళాలా.? టీడీపీతో కలిసి వెళితే ఏమవుతుంది.? ఒంటరి పోరుతో లాభమా.? నష్టమా.? టీడీపీ – బీజేపీ.. ఈ రెండితో కలిస్తే లాభమేంటి.? ఇలా పలు అంశాలపై జనసేన పార్టీలో లోతైన చర్చ జరుగుతోంది. ‘దత్త పుత్రుడు’ అంటూ అధికార వైసీపీ, జనసేన అధినేత మీద పదే పదే విమర్శలు చేస్తూ వస్తోంది. ఇదొక మైండ్ గేమ్.! ఆ ట్రాప్‌లో జనసేన ఇప్పటికే పడిపోయింది. చంద్రబాబు ఆడుతున్న డ్రామాకి కూడా పవన్ కళ్యాణ్ బలిపశువుగా మారిపోయారు.

ఈ నేపథ్యంలో జనసైనికులు ఎంతలా కష్టపడుతున్నా, జనసేన పార్టీ జనంలో బలపడలేకపోతోందన్నది నిర్వివాదాంశం. దాంతో, ఎలాగైనా, ఈ ‘దత్తత మచ్చ’ చెరిపేసుకోవాలన్నది జనసేన అధినేత ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, ‘మనం చెరిపేసుకోవాలనుకుంటే చెరిగిపోదది. 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసినా.. ఆ మచ్చ చెరిగిపోలేదు..’ అని పవన్ కళ్యాణ్‌కి కొందరు జనసేన నేతలు సూచిస్తున్నారట. టీడీపీతో కలిసి వెళితేనే లాభం.? అయితే, టీడీపీని గట్టిగా డిమాండ్ చేయగలిగే స్థాయిలో జనసేన వుండాలి.. ఇదీ జనసేనలో కొందరు నేతలు అధినేతకు చేస్తోన్న సూచన తాలూకు సారాంశం.

కానీ, టీడీపీ అనే కొరివితో తల గోక్కుంటే ఏమవుతుందో పవన్ కళ్యాణ్‌కి బాగా తెలుసు. ఆ కారణంగానే, ‘సోలో ఫైట్’ అనే నినాదానికే పవన్ కట్టుబడి వున్నారన్నది జనసేన వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. ‘ఎవరేమనుకున్నా జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుంది..’ అనే సంకేతాల్ని ప్రజల్లోకి బలంగా పంపాలని జనసేనాని డిసైడ్ అయ్యారట.