జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విరాళాల విషయమై చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లోనే కాదు, జన బాహుళ్యంలోనూ చర్చకు తెరలేపింది. సినీ ప్రముఖులు విరాళాలు ఇవ్వడం కొత్త కాదు. కానీ, రాజకీయ నాయకులు విరాళాలు ఇవ్వడమే చాలా అరుదైన విషయం. సినీ నటులు కోట్లాది రూపాయల విరాళాల్ని ఆయా సందర్భాల్లో ప్రకటించినా, వారిపై విమర్శలు వస్తూనే వుంటాయి. అదే, రాజకీయ నాయకుల విషయానికొస్తే విరాళాలు ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.
డబ్బులు అక్కడుంటాయ్, ఇక్కడుండవ్
ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కోట్లు వస్తాయ్‌గానీ, విరాళాలు ఇవ్వడానికి మాత్రం చేతులు రావు. ఎందుకిలా.? అంటే, దానికీ ఓ లెక్కుంది. రాజకీయ నాయకులు ఎన్నికల వేళ సమర్పించే అఫిడవిట్లలో తమ ఆస్తులకు సంబంధించిన వివరాల్ని పేర్కొంటారు. పాపం, చాలామందికి సొంత కార్లు కూడా వుండవు. సొంత ఇళ్ళు కూడా లేని రాజకీయ నాయకులుంటారు. కానీ, ఇవన్నీ నిజాలు కావు. కోట్లకు పడగలెత్తని రాజకీయ నాయకుడ్ని మనం ప్రస్తుత రాజకీయాల్లో చూడలేం. ఎన్నికల అఫిడవిట్లలో లెక్కలు అలా వుంటాయ్ కాబట్టి, విరాళాలు ఇస్తే కొత్త సమస్యలొస్తాయ్. అదీ అసలు సమస్య. అందుకే, విపత్తుల వేళ రాజకీయ నాయకులు అందించే సాయాల వెనుక వేరే లెక్కలుంటాయి. కానీ, ప్రజలకు వాస్తవాలు తెలియాలి.
విరాళాల్లో వాళ్ళే గొప్ప
విరాళాల విషయానికొస్తే, రాజకీయ నాయకులకంటే సినీ ప్రముఖులే చాలా చాలా గొప్ప. విపత్తుల వేళ అధికారంలో వున్నోళ్ళు ప్రభుత్వ ఖజానా నుంచి, బాధిత ప్రజల్ని ఆదుకునేందుకు సొమ్ములు వెచ్చించాల్సి వుంటుంది. ఈ క్రమంలో సీఎం సహాయ నిధి అనీ, పీఎం సహాయ నిధి అని వుంటాయి. వాటికి సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సామాన్యులు విరాళాలు ప్రకటిస్తుంటారు. మళ్ళీ ఈ విరాళాల్లో ‘ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం’ అనే విమర్శ వుండనే వుంది. ఇక్కడ సమస్య ఎందుకు వస్తోందంటే, రాజకీయ నాయకులు విరాళాలు ఇవ్వరు సరికదా, సినీ ప్రముఖుల్ని ప్రశ్నిస్తుంటారు, నిలదీస్తుంటారు.. ట్రోల్ చేస్తుంటారు.. కొందరికి రాజకీయాలూ అంటగడుతుంటారు. చీటికీ మాటికీ పవన్ కళ్యాణ్‌ని విమర్శించే రాజకీయ నాయకులు, ఇప్పుడీ విరాళాల వ్యవహారంపై ఆయన్ని విమర్శించగలరా.? ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?