జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆ విషయాన్ని స్వయంగా జనసేన అధినేత వెల్లడించారు. హైద్రాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్ళి, అక్కడ తాను బస చేసిన హోటల్ నుంచి, ప్రధాని బస చేసిన ఐఎన్ఎస్ చోళకు వెళ్ళారు. ప్రధానితో భేటీ అంటే అది అధికారిక కార్యక్రమం కిందనే లెక్క. సో, ఇక్కడ గందరగోళానికి అవకాశమే లేదు. 35 నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, అసలు పవన్ – మోడీ కలవలేదన్న ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియా విభాగం తెరపైకి తెస్తోంది.
‘మోడీని పవన్ కళ్యాణ్ కలిశారని ఎవరు చెప్పారు.? పవన్ కళ్యాణ్ డబ్బా కొట్టుకున్నారంతే.! నిజంగా ఆ ఇద్దరూ కలిసి వుంటే, ఫొటోలు బయటకు వచ్చేవి కదా..’ అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రశ్నలు సంధిస్తోంది. నిజమే, ప్రధానితో జనసేనాని కలిస్తే.. దానికి సంబంధించిన ఫొటోలు విడుదలవుతాయ్. కానీ, ఇంతవరకు అలాంటి ఫొటోలేవీ బయటకు రాలేదు. అలాగని ప్రధాని – జనసేనాని భేటీ జరగలేదని ఎలా అనగలం.? ఇదే వైసీపీ అనుకూల మీడియా, వైసీపీ సోషల్ మీడియా విభాగం, ప్రధాని నరేంద్ర మోడీ.. పవన్ కళ్యాణ్‌కి టీడీపీతో పొత్తు విషయమై చీవాట్లు పెట్టారని అంటోంది. ఇందులో ఏది నిజం.? వైసీపీలోనే స్పష్టత లేదాయె.
నిజానికి, వైసీపీ ఇంతలా గింజుకోవాల్సిన అవసరం లేదు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన జనసేనాని, 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న చంద్రబాబు.. ఈ ఇద్దరూ కలిస్తే ఏమవుతుంది.? అసలు రాష్ట్రంలో ఓట్ల శాతం అస్సలు లేని బీజేపీ కూడా ఈ రెండిటితో కలిసినా వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదు. పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ చేస్తున్న అతి, ఆ వైసీపీని ముంచేసేలా వుంది.