బాబుకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్న పవన్… కారణం కరెక్టే?

గత ప్రభుత్వ పాలనలో అవినీతి విలయతాండవం చేసిందని, బాబుపాలనలో అవినీతి.. ఇందు కలదు అందు లేదనే సందేహం వలదు.. ఎందెందు వెదికినా అందందూ కలదు.. అన్నస్థాయిలో జరిగిందని జగన్ సర్కార్ ఆరోపిస్తుంది. ఇవి కేవలం ఆరోపణలుగా మిగిలిపోకుండా.. వివరాలు వెలికితీసే పనిని మంత్రులకూ అప్పగించింది. ఆ వెలికితీతల్లో సమాచారం పుష్కలంగా ఉండటంతో.. “సిట్” వేసింది. అయితే… ఇంతకాలం స్టే లో ఉన్న ఈ “సిట్” కి తాజాగా సుప్రీం తీర్పు రెక్కలు తొడిగింది! అయితే… ఈ విషయంలో బాబు కంటే పవనే ఎక్కువ టెన్షన్ పడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు!

2014 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యక్షంగా పవన్ పాత్ర లేకపోయినా.. చంద్రబాబు కేబినెట్ లో జనసేన మంత్రులు పనిచేయకపోయినా.. అసెంబ్లీలో మిత్రపక్షంగా జనసేన ఎమ్మెల్యేలు పాలుపంచుకోకపోయినా… పవన్ కు టెన్షన్ పెరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు. కారణం… గతం కంటే ఎక్కువగా భవిష్యత్తు బయపెడుతుందట.

రాబోయే ఎన్నికల్లో కిందామీద పడి ఎలాగైనా సరే చంద్రబాబుతో కలిసి పోటీచేయాలని పవన్ బలంగా ఫిక్సయ్యారు. ఒంటరిగా వెళ్తే వీరమరణమే అని తనశక్తిని తాను పూర్తిగా నమ్ముతున్న పవన్… పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా ఇంకా ఎమ్మెల్యేగా గెలవలేని అవమానం నుంచి బయటపడాలని భావిస్తున్నారంట. సరిగ్గా ఈ సమయంలో “సిట్” దర్యాప్తుకు సుప్రీం అనుమతి ఇవ్వడంతో… కచ్చితంగా బాబు బండారం బయటపడుతుందనేది పవన్ భయంగా చెబుతున్నారు.

మరి ముఖ్యంగా అమరావతిలో జరిగిన అవినీతి, ఏపీ ఫైబర్ గ్రిడ్ అక్రమాలు, ఇ.ఎస్.ఐ. కుంభకోణం.. మొదలైనవాటికి సంబంధించి ఇప్పటికే ఏపీ సీఐడీ కీలక సమాచారం సేకరించిందనే సమాచారం పవన్ దగ్గర ఉందని అంటున్నారు. ఇంతకాలం అంటే సిట్ పై స్టే ఉండటంతో కాస్త రిలాక్స్ గా ఉన్నాం కానీ… అసలే జగన్.. పైగా అవినీతిపై ఆరోపణలు కాకుండా, ఆధారాలే ఉన్నాయని తెలుస్తున్న పరిస్థితి. ఇలాంటప్పుడు జగన్… బాబు & కో లను ఏమాత్రం ఉపేక్షించరని పవన్ బలంగా నమ్ముతున్నారంట.

సపోజ్.. ఫర్ సపోజ్.. ఏపీలో గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు నిరూపణైతే… టీడీపీ నేతల్లో ఎవరు జైలుకు వెళ్తారు, ఎవరు బెయిల్ పై బయట తిరుగుతారు అనే సంగతి పక్కనపెడితే… ఆ ఎఫెక్ట్ తన పార్టీపై ఎంత పడుతుందనేది ప్రధాన భయం అని తెలుస్తుంది. ఇప్పటికే గత ఎన్నికల్లో సున్నాకీ ఒకటికీ మధ్య ఫలితాలొచ్చిన పరిస్థితుల్లో… ఇక అవినీతిలో కూరుకుపోయిన పార్టీతో పొత్తంటే… అది కూడా కష్టమనే భావనలో పవన్ ఉన్నారని అంటున్నారు.

మరి ఈ సిట్ విచారణ ఎఫెక్ట్ పవన్ భయపడుతున్నట్లు… జనసేనపై ఏ మేరకు ప్రభావం చూపించబోతుందనేది వేచి చూడాలి!