బూతు రాజకీయం.! తప్పటడుగు వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!

నిజానికి, పవన్ కళ్యాణ్ కొత్తగా ఏమీ మాట్లాడలేదు. ఆవేశం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో నోరు అదుపులో వుండదు. మాటల్లో బూతులు దొర్లేస్తాయ్.! అయితే, ఈసారి ఇంకాస్త ఎక్కువ దొర్లాయ్. ప్రజారాజ్యం పార్టీలో వున్నప్పుడూ అదే పద్ధతి.. ఇప్పుడూ అదే పద్ధతి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విశాఖలో నిజానికి హుందాగానే వ్యవహరించారు. విజయవాడ వచ్చేసరికి ఏమయ్యిందో అసహనానికి గురయ్యారు. వైసీపీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలనీ నానా రకాలుగా తిట్టేశారు. ఈ తిట్లతో పవన్ కళ్యాణ్ సాధించేదేంటి.? జనసైనికుల్లో కొత్తగా పవన్ కళ్యాణ్ నింపే ఉత్సాహం ఏముంటుంది.?

బస్తీ మే సవాల్.. కొట్టేసుకుందాం.. అని ఓ రాజకీయ పార్టీ అధినేత అనడం ఎంతవరకు సబబు.? నిజానికి, ఎమ్మెల్యేలు కూడా ఆ మాట అనకూడదు. రాజకీయాల్లో ఎవరూ ఆ మాట అనకూడదు. కానీ, అనేస్తున్నారు. టీడీపీ, వైసీపీ.. ఈ తేడాలేం లేవు. రాజకీయాల్లో అందరిదీ ఒకటే బాట. ఆ లిస్టులో జనసేన కూడా చేరిపోయింది.

జనసేనాని విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్ ఎటాక్ మామూలే. అక్కడికేదో వేసీపీ నేతలు ‘పద్ధతికి తామే బ్రాండ్ అంబాసిడర్’ అన్నట్లు ఇప్పుడు నీతులు చెబుతారు. వైసీపీ అలా బూతులు తిట్టడం వల్లే, వారికి అర్థమయ్యే భాషలో జనసేన అధినేత ఈ రోజు ఇలా కౌంటర్ ఎటాక్ ఇవ్వవలసి వచ్చిందన్నది నిర్వివాదాంశం.

కానీ, వైసీపీ రాజకీయాల్లో తానేంటో ప్రూవ్ చేసుకున్న పార్టీ. జనసేన అలా కాదు. ప్రజల్ని మెప్పించగలగాలి. బహుశా బూతులు తిడితేనే ప్రజలు గుర్తిస్తారని జనసేనాని అనుకుంటున్నారేమో.! వైసీపీని కూడా అలాగే ప్రజలు గుర్తించారని పవన్ కళ్యాణ్ నమ్మినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

కొడాలి నాని సహా వైసీపీలో చాలామంది మాట్లాడే బూతులతో పోల్చితే, పవన్ కళ్యాణ్ ఒక్క శాతం బూతులు కూడా మాట్లాడలేదు. కానీ, ఓ పార్టీ అధినేత ఇలా మాట్లాడటం అత్యంత హేయం.!