ఆ విషయంలోనే అడ్డంగా దొరికిపోతున్న పవన్!

ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న జనసేన వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడుతున్నారు. పనిలోపనిగా జగన్ ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా జగన్ సామ్రాజ్యాన్ని కూడా కూల్చేస్తానంటూ భారీ భారీ డైలాగులే పేల్చారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ సందర్భంగా కన్నబాబు, తోట త్రిమూర్తులపై చేసిన వ్యాఖ్యల సందర్భంగా అడిగిన ఒక ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలోగల సర్పవరం జంక్షన్ లో జరిగిన భారీ బహిరంగసభలో మైకందుకున్న పవన్… కన్నబాబు, తోట త్రిమూర్తులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా… “కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే తోట త్రిమూర్తులు, కన్నబాబు ఏం చేస్తున్నారు? కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నారా చెప్పండి” అంటూ ప్రశ్నించారు. దీంతో.. వైసీపీ నేతలకు అడ్డంగా దొరికిపోయారు పవన్ అని అంటున్నారు పరిశీలకులు.

అవును… పవన్ ఏ విషయాన్ని ప్రస్థావించినా, వైసీపీ నాయకులపై రాజకీయంగా ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు చేసినా… అవి నచ్చే వారికి నచ్చుతాయి, నచ్చని వారికి నచ్చవు. ఇక వైసీపీ నేతల రియాక్షన్ సంగతి వేరే! అయితే… పవన్ కల్యాణ్ కు మాత్రం “కాపు రిజర్వేషన్స్”పై మాట్లాడే నైతిక అర్హత కానీ, వైసీపీ నేతలను ప్రశ్నించే హక్కుగానీ లేదనేది విశ్లేషకుల మాటగా ఉంది. కారణం చెబితే మళ్లీ మొదటికే వ్యవహారం వస్తుంది.

కాపు రిజర్వేషన్ అనే అంశం వస్తే.. కచ్చితంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రస్థావన వచ్చి తీరాలి. కాపు రిజర్వేషన్స్ ఇస్తామని మాట ఇచ్చి ఓట్లు వేయించుకుని, పక్కన పవన్ ని పెట్టుకుని మరీ కాపులను వంచించిన చరిత్ర చంద్రబాబు సొంతం అనేది బాబు-పవన్ ద్వయంపై ఉన్న తీవ్ర విమర్శ. ఆ సమయంలో ఈ హామీని నెరవేర్చమని ప్రశ్నించిన, పోరాడిన ముద్రగడ పద్మనాభం విషయంలోనూ, ఆయన కుటుంబ సభ్యుల విషయంలో జనసేనతో అనధికారిక పొత్తులో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన వైఖరి అత్యంత దారుణం!

ఈ విషయాన్ని పవన్ మరిచిపోయినా.. మరిచిపోయినట్లు నటించినా.. కాపు సామాజిక వర్గ ప్రజలు మాత్రం మరిచిపోరన్న విషయం అయినా పవన్ మరిచిపోకూడదు. ఈ విషయంలో కాపు రిజర్వేషన్ తన పరిధిలోది కాదన్న జగన్ నిజాయితీని సంకించలేని పరిస్థితి. ఈ విషయాలు కాపులు గ్రహించారు కాబట్టే… బాబుతో కలిసి కాపులను వంచించిన పవన్ ని సైతం పక్కనపెట్టి… జగన్ కు బ్రహ్మరధం పట్టారు. ఈ విషయం పవన్ కి తెలియంది కాదు!!

అయినా సరే ఎంత విమర్శించాలన్న ఫ్లోలో ఉన్నా కూడా… కాపు రిజర్వేషన్స్ విషయంలో ఆ సామాజికవర్గ ప్రజలను వంచించిన ముద్దాయిల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఏ1, ఏ2 లుగా ఉన్నారనేది బలంగా వినిపిస్తున్న మాట. పవన్ ఇలా కాపు రిజర్వేషన్స్ పై వైసీపీ నేతలను ప్రశ్నించిన ప్రతీసారీ… 2014 నాటి చంద్రబాబు-పవన్ ల ధ్వయం చేసిన ప్రతీ పని, ఇచ్చిన హామీ, ప్రశ్నించినవారిపై అనుసరించిన వైఖరి కళ్లముందు కదలాడుతుందనేది వాస్తవం అనేది రాజకీయ పండితుల అభిప్రాయంగా ఉంది.

మరి పవన్ ఈ విషయంలో అసలు తన అభిప్రాయం ఏమిటనేది కూడా కాపు సమాజానికి చెబితే బాగుంటుందనేది పలువురి అభిప్రాయంగా ఉంది. తాను కాపు రిజర్వేషన్స్ కి కట్టుబడి ఉన్నానని చెబుతారా… తాను అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెబుతారా… లేక, ఈ అంశాన్ని అధికార వైసీపీని విమర్శించడానికి మాత్రమే ఉపయోగిస్తూ… 2014 నాటి సంఘటనలు గుర్తుచేస్తూ.. కాపుల్లో మరింత చులకన అయిపోతారా అన్నది వేచి చూడాలి!