పవన్ కళ్యాణ్, చంద్రబాబు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు.?

తెలుగుదేశం పార్టీతో తమ పార్టీకి పొత్తు వుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అంతే కాదు, బీజేపీ – టీడీపీ – జనసేన కలిసే పోటీ చేస్తాయనీ జనసేనాని తెగేసి చెబుతున్న సంగతి తెలిసిందే.

అయితే, టీడీపీతో కలిసే విషయాన్ని బీజేపీ ఒప్పుకోవడంలేదు. అంతే కాదు, టీడీపీ కూడా జనసేనతోగానీ, బీజేపీతోగానీ పొత్తు పెట్టుకుంటామని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించింది లేదు.

కూటమి అంటే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేలాలి. ‘ముఖ్యమంత్రి పదవి స్వీకరించేందుకు సిద్ధంగానే వున్నాను’ అన్నది జనసేనాని వాదన. ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేది చంద్రబాబేనని టీడీపీ స్పష్టంగా చెప్పేస్తోంది.

పొత్తు కుదరాలంటే, ముందైతే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేలాలి. ‘కూటమి కుదురుతుంది.. ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణే..’ అన్నది జనసేన నేతలు కుండబద్దలుగొడుతున్న అంశం.

అస్సలేమాత్రం స్పష్టత లేని వింత, వికారపు కూటమిగా టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మారిపోతోంది. వారాహి విజయ యాత్రలో ఎక్కడా జనసేన అధినేత, తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడంలేదు.

ఇంకోపక్క, తెలుగుదేశం పార్టీ మాత్రం తమ అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ వెళుతోంది.. అదీ, జనసేన కాస్త బలంగా కనిపిస్తున్న ప్రాంతాల్లో. ఈ  మొత్తం పరిణామాల్ని అధికార వైసీపీ నిశితంగా పరిశీలిస్తోంది. ‘జనసేనను మనం ఏమీ అనాల్సిన పనిలేదు. టీడీపీ విషయంలో అయినా అంతే.. బీజేపీ, టీడీపీ, జనసేన.. ఈ కూటమికి వేరే శతృవులు అక్కర్లేదు’ అనే భావన వైసీపీలో నెలకొంది.