ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సుమారు రెండూ వారాలకు పైగా పర్యటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… పవన్ ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర ప్రారంభమైన సమయంలో ప్రధానంగా కత్తిపూడి నుంచి కాకినాడ వరకు చేసిన ప్రసంగాల్లో తాను ముఖ్యమంత్రి పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
దీంతో… పవన్ కల్యానే స్వయంగా చెప్పేసరికి జనసైనికులు సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు. పవన్ కూడా మధ్య మధ్యలో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే… అంటూ హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు. చిన్న సైజు మేనిఫెస్టో ప్రకటన స్థాయిలో కొన్ని హామీలు ఇచ్చేశారు. ఇందులో ప్రతీ నియోజకవర్గంలో 500 మంది యువకులను ఎంపిక చేసి వారి 10 లక్షల రూపాయలు ఇచ్చి వ్యాపారాలు చేసేలా, యువ పారిశ్రామిక వేత్తలను చేసేలా ప్రోత్సహిస్తానని ప్రకటించారు.
ఇది తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రకటించిన దళిత బందుకు మరో రూపం అంటూ వచ్చిన కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ హామీపై పలువురు జనసైనికులు ఫుల్ హోప్స్ పెట్టుకున్నారని అంటున్నారు. అయితే అనంతరం కోనసీమలోకి ఎంటరైన పవన్… ఇక ఆ ప్రస్థావన తేవడం మానేశారు. వైసీపీ రహిత గోదావరే తన లక్ష్యం అంటూ కొత్త పాత అందుకున్నారు!
అయినా కూడా ఇంకా కొంతమంది జనసైనికుల్లో మాత్రం… పవన్ సీఎం అభ్యర్థే అని నమ్ముతున్నారు.. మరికొంతమంది జనసేన ఒంటరిగా పోటీ చేయబోతోందని భావిస్తున్నారు. ఈ సమయంలో మాట మార్చిన పవన్… ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో… సీఎం అవ్వాలంటే చాలా అనుభవం, అవగాహనా ఉండాలని… జనసైనికుల తృప్తి కోసం తాను సీఎం అనే మాటలు చెప్పానని సన్నాయి నొక్కులు నొక్కారు!
అయితే ఆ విషయం పెద్దగా హైలైట్ అయినట్లుగా జనసైనికులు స్పందించలేదు. ఈ సమయంలో వారాహి యాత్ర – 2 కి పవన్ రెడీ అవుతున్నారని అంటున్నారు. ఎక్కడ ఆపారో అక్కడినుంచే మొదలుపెడతారని చెబుతున్నారు. దీంతోపాటు పొత్తు కూడా కన్ ఫాం అని… పవన్ పర్యటనలో భాగంగా సభలు పెడుతున్న స్థానాలు జనసేనకు కేటాయించినవే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దీంతో… పవన్ ని సీఎం అభ్యర్థి అని బలంగా నమ్ముతూ, సీఎం అవ్వాలని మరింత బలంగా ఆకాంక్షిస్తూ, జనసేన యాత్రల్లో పాలుపంచుకుంటున్న జనసైనికులకు పవన్ ఏమి చెప్పబోతున్నారనేది ఆసక్తిగా మారింది. దీంతో… మరికొంతమంది జనసైనికులు మనసు మార్చుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.
కారణం… పవన్ అయితే ఓకే కానీ… బాబు కోసం పవన్ కి ఓటెయ్యమంటే మాత్రం… జగనే బెటర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! దీంతో చంద్రబాబుతో దోస్తీ పవన్ కు అవసరమేమో కానీ… జనసైనికులకు ఏమి పని అని తేల్చేస్తున్నారు. జనసేన కోసం ఏమి చేయమన్నా చేస్తాం.. ఆ కష్టం ఫలితం చంద్రబాబుకు అంటే మాత్రం అంగీకరించం అని అంటున్నారని తెలుస్తుంది. మరి పవన్ ఎలా సర్ధిచెబుతాడో వేచి చూడాలి!!