సంక్షేమం విషయంలో జగన్ ఫుల్ మార్కులు సంపాదించారని అంటుంటారు. కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా కూడా జగన్ వాటిని ఆపలేదని చెబుతుంటారు. ఇదే సమయంలో చాలా రాష్ట్రాల్లో జగన్ పథకాలపై చర్చ నడుస్తుందని అంటుంటారు.
ఈ సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై జనసేన అధినేత పవన్ కల్యాన్ స్పందించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథాకాలపై జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. వాటిని మరింత మెరుగ్గా అమలు చేస్తామని అన్నారు.
“రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఆయా ప్రవేశపెట్టిన పథకాలు ఆగిపోతాయని, సంక్షేమం ఆగిపోతుందని దయచేసి అపోహ పడకండి. ఏ పథకమూ ఆగదు, మెరుగైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం” అని మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జరిగిన సభలో పవన్ కల్యాణ్ అన్నారు.
దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. జగన్ పాలన బాగుంటే వెళ్లి సినిమాలు చేసుకుంటాను – లేకపోతే మళ్లీ రాజకీయాళ్లోకి వస్తాను అని పవన్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ సీఎం అయిన అనంతరం పవన్ వరుసగా సినిమాలు చేసుకున్నారు. .దీంతో జగన్ పాలనపై పవన్ పరోక్షంగా కితాబిచ్చారనే కామెంట్లు వినిపించాయి.
ఇప్పుడు వారాహి యాత్రలో భాగంగా జగన్ పాలనపై పవన్ విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో జగన్ పథకాలు బాగున్నాయని ప్రజలు భావిస్తున్నారని నమ్మారో ఏమో కానీ… జగన్ అధికారంలోకి రాకపోయినా కూడా ఆ పథకాలు ఆగవని, కచ్చితంగా కొనసాగిస్తామని చెబుతున్నారు. దీంతో… ఇది జగన్ సక్సెస్ అని అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా ఒక ప్రభుత్వం పెట్టిన పథకాలను మరో పార్టీ సమర్ధించదని చెబుతుంటారు! వాటికే పేర్లు మార్చి ప్రకటించడం.. లేదా మరింత లోతుగా అధ్యయనం చేసి కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తుంటారని అంటుంటారు. అలాకానిపక్షంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సక్సెస్ అయిన పథకాలను పేర్లు మార్చి, అర్హతలు మార్చి కొత్త హామీగా మసిపూసి ప్రవేశపెడుతుంటారని చెబుతుంటారు.
అయితే విచిత్రంగా… ఏపీలో మాత్రం జగన్ ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని తీసేది లేదని.. తాము అధికారంలోకి వచ్చినా ఆ పథకాలు కంటిన్యూ అవుతాయని విపక్షాలు చెప్పడం కొత్త విషయం అని అంటున్నారు పరిశీలకులు. ఇది పరోక్షంగా జగన్ పాలనకు, విజన్ కి విపక్షాలు ఇస్తున్న కితాబని చెబుతున్నారు.