తెలంగాణ యువత ఇబ్బందికి ఏపీ కారణం… పవన్ అజ్ఞానం పీక్స్?

ఎన్నారై జనసేన గల్ఫ్ విభాగం సభ్యులతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. తెలంగాణ ఎన్నికలు కూడా జనసేనకు ప్రాధాన్యమైనవే అని అన్నారు. అంటే ఏపీలో బీజేపీ పొత్తు తెలంగాణలో కంటిన్యూ అవుతుందో లేదో మాత్రం చెప్పలేదు.

ఆ పరిపూర్ణమైన అసంతృప్త మాటల సంగతి కాసేపు పక్కనపెడితే… అనంతరం తెలంగాణ యువత ఇబ్బంది పడుతుందని.. అందుకు కారణం ఎపీ అభివృద్ధి చెందకపోవడమే అని.. ఫలితంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో యువతకు న్యాయం జరగడం లేదని పవన్ సరికొత్త లాజిక్ తెరపైకి తెచ్చారు. దీంతో.. ఇదోరకం అజ్ఞానం అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఇంతకూ పవన్ ఏమన్నారంటే… “ఏపీ బాగుపడితే తెలంగాణాలో ఉద్యోగాల కోసం ఎవరూ వెళ్లరు.. ఏపీ నుంచి తెలంగాణాకు యువత ఉద్యోగాలకు వెళ్లడం వల్ల అక్కడ యువతకు ఇబ్బంది కలుగుతోంది.. తెలంగాణా నాకు ఆత్మ.. విభజన తర్వాత ఏపీ బాగుపడితే తెలంగాణాలో యువతకు ఉద్యోగాలకు ఇబ్బంది ఉండేది కాదు” అని అన్నారు.

దీంతో పవన్ పై విరుచుకుపడుతున్నారు విశ్లేషకులు. రాష్ట్రం విడిపోయిన అనంతరం ఏపీలో ఐదేళ్లు అధికారంలో ఉన్నది బీజేపీ – టీడీపీ – జనసేన ప్రభుత్వమే కదా.. అప్పుడు అభివృద్ధి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ చాలా విషయాలు మరిచిపోతున్నారో.. లేక, జనాలు మరిచిపోయారని అనుకుంటుబ్న్నారో అంటూ.. కొన్ని గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా… ఈ రోజుకీ ఏపీ తెలంగాణాకు హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని అనే విషయం పవన్ కు గుర్తుచేస్తున్నారు పరిశీలకులు. అంటే 2024 జూన్ 2 వరకూ హైదరబాద్ లో అధికారికంగా ఏపీకీ హక్కుంది. నోటుకు ఓటు కేసుకు భయపడి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన పని వల్ల… ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొంది! ఈ విషయం నిజంగానే పవన్ కు తెలియదా.. లేక, జనాలు మరిచిపోయారని భావిస్తున్నారా?

తెలంగాణాలోని హైదరాబాద్ కి ఒక్క ఏపీ నుంచే కాదు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి యువత ఉపాధి కోసం వస్తున్నారు. మరి అక్కడ ఏపీ మాదిరిగా విభజన జరగలేదు కదా. ఆయా రాష్ట్రాలు బాగానే ఉన్నాయి కదా. ఇదే తెలంగాణా నుంచి అమెరికాలో ఉద్యోగాల కోసం యువత వెళ్తోంది. వారి సంగతేంటి, అంటే తెలంగాణా ఉపాధి కేంద్రం కాదనుకుని వెళ్తున్నారా. ఈ ఎలిమెంటరీ స్థాయి ప్రశ్నలకు అయినా పవన్ సమదానం చెప్పగలరా అని అంటున్నారు!

నిజానికి తెలంగాణాలో ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ విధంగా మాట్లాడడం లేదు! మా నిధులు, మా నియమాకాలు ఏపీ యువత తీసుకుంటోంది అని వారే అనడం లేదు. మరి ఏపీకి చెందిన పవన్ అలా అనడమేంటి అన్నదే ప్రశ్నగా ఉంది. తెలంగాణా ఆత్మ అని అంటున్న పవన్.. అక్కడే రాజకీయాలు చేసుకోవచ్చు కదా అన్న సూచనలు కూడా ఈ సందర్భంగా వస్తుండటం గమనార్హం.

దీంతో పవన్ తన రాజకీయాల కోసం గతంలో చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఆ అనుసరణలో పడి మొదటికే మోసం తెచ్చుకుంటున్నారని అంటున్నారు. ఏ రోటికాడ ఆ పాట పాడకుండా… కాస్త విజ్ఞత కలిగి నడుచుకోవాలని సూచిస్తున్నారు! అలాకానిపక్షంలో రెంటికీ చెడ్డ రేవటిలా పరిస్థితులు మారతాయని అంటున్నారు పరిశీలకులు. .