ఆ విషయంలో బాబు కంటే… నాలుగు ఆకులు ఎక్కువే చదివిన పవన్!

రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా దాటవేసే దోరణిలో ఈ సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారని అప్పట్లో కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏకంగా నాలుగు నాలుకల సిద్ధాంతాన్ని ఎంచుకున్నట్లున్నారని అంటున్నారు పరిశీలకులు.

అవును… రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమో, వ్యతిరేకమో చెప్పలేకపోయారు. తనకు రెండు ప్రాంతాలూ ముఖ్యమే అంటూ దాటవేత దోరణిని అవలంభించారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని గ్రహించారు. చంద్రబాబు టీడీపీని తమ రాష్ట్రంలో కనిపించకుండా చేశారు!

ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ విషయానికొస్తే… పూటకో మాట, ప్లేస్ కో స్టేట్ మెంట్ ఇస్తూ… నాలుకకి నరం లేదని అస్తమానం గుర్తుచేస్తుంటారు! ఒక్కమాటపై కూడా స్థిరంగా నిలబడలేని అస్థిరత్వం, అస్పష్టత పవన్ సొంతం అని చెప్పుకున్నా అతిశయోక్తి కాదేమో. ఇందులో భాగంగా… తాజాగా మరోసారి నాలుకమడత మాటలు మాట్లాడారు పవన్!!

వారాహి యాత్రలో టీడీపీతో పొత్తు గురించి ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడని పవన్… పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదని చెప్పుకొచ్చారు. తనను సీఎం చేయమని కార్యకర్తలను కోరారు. దీంతో అభిమానుల కేరింతలు మరింత పెరిగాయి. తాను ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ ప్రకటించడంతో… జనసైనికులకు క్లారిటీ వచ్చిందని కథనాలొచ్చాయి.

ఈ నేపథ్యంలో వారాహి యాత్ర మధ్యలో కొన్ని పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా… తాను ముఖ్యమంత్రిని ఎలా అవుతారని ఎదురు ప్రశ్నించారు. అభిమానులు తనను ముఖ్యమంత్రిగా చూడాలని సీఎం సీఎం అని అరుస్తుంటే వాళ్ళలో హుషారు పెంచటానికి తాను కూడా ముఖ్యమంత్రిని చేయమని అడిగానంతే అన్నారు. దీంతో… చికాకు పడిన కొంతమంది జనసైనికులు… ఆఫ్ ద రికార్డ్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారనే కథనాలొచ్చాయి.

ఈ నేపథ్యంలో తాజాగా హస్తినలో మైకులముందుకు వచ్చిన పవన్ కల్యాణ్… తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు లేవని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నిక‌ల్లో పాల్గొంటాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందనేందుకు వారాహి యాత్రలకు హాజరవుతున్న జనాలే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పనైపోయినట్లే అని చెప్పారు. అలా అంటూనే… తనను ముఖ్యమంత్రిగా చూడాలని జనసైనికులు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు.

దీంతో… పవన్ కు స్థిరత్వమే లేదని.. కాలినిలకడతో పాటు మాట నిలకడ కూడా శూన్యమని అంటున్నారు పరిశీలకులు. ప్రజలు నాయకుల్లో ముందుగా చూసేది మాటమీద నిలబడే తత్వమే అని అంటున్నారు. జగన్ ను ఆ మాట మీద నిలబడే తత్వమే గెలిపించిందని… చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవ్వడంవల్లే బాబు పరిస్థితి ఇలా అయిపోయిందని గుర్తుచేస్తున్నారు. దీంతో… నిలకడలేని నాయకులను జనం ఏమాత్రం నమ్మరని నొక్కి వక్కానిస్తున్నారు!