గత ఎన్నికల్లో వైఎస్ జగన్ చూపించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. జగన్ పేరు చెప్పుకుని జనానికి పెద్దగా పరిచయం లేని వ్యక్తులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. టీడీపీలోని సీనియర్ లీడర్ల మీద వైసీపీ తరపున చిన్న చిన్న లీడర్లు కూడ భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థులు సాధించిన మంచి విజయాల్లో జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఓడించడం కూడ ఒకటి. పవన్ రెండు చోట్ల పోటీచేసినా గాజువాక మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు గాజువాకలో ఇల్లు అద్దెకు తీసుకుని మకాం పెట్టారు. గెలుపు కోసం బాగానే కష్టపడ్డారు. అయినా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గెలుపొందారు. స్వయంగా జగన్ రంగంలోకి దిగి రియల్ హీరోని గెలిపించండి అంటూ ప్రచారం చేయడంతో పవన్ మీద ఏకంగా 16 వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గట్టి పోటీ ఇచ్చినా లాభంలేకపోయింది.
అలా గాజువాక వైసీపీ వశమైంది. గాజువాక విశాఖలోని ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటి కావడంతో దానిని నిత్యం కాపాడుకుంటూ ఉండాలి. పైపెచ్చు త్వరలో విశాఖ పాలనా రాజధాని కానుంది. గెలుస్తామనుకున్న గాజువాకలో ఓడటంతో పవన్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పంతంతో ఉన్నారు. పైపెచ్చు అక్కడ ఆయన సామాజికవర్గం చాలా ఎక్కువ. వారిలో కొంతమంది గత ఎన్నికల్లో వైసీపీ వైపు చూడటంతో పవన్ ఓడిపోవాల్సి వచ్చింది కానీ లేకుంటే గెలిచేవారే. ఇప్పుడు వారే వైసీపీ ఎమ్మెల్యే మీద కొంచెం గుర్రుగా ఉన్నారట. ఆ సామాజికవర్గం నేతలను నాగిరెడ్డి దూరం పెడుతున్నారని టాక్ వినబడుతోంది. ఎంతసేపటికీ సొంత సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారట. ఇది వైసీపీలో ఉన్న కాపు సామాజికవర్గానికి నచ్చట్లేదట.
అంతేకాదు నాగిరెడ్డి తెలుగుదేశం వర్గీయులను చేరదీస్తున్నారనే మాట కూడ ఉంది. కుమారుడిని రాజకీయాల్లోకి దింపిన ఆయన మిగతా లీడర్లను సైడ్ చేసి పార్టీకి సంబంధించిన అన్ని పనులను కుమారుడికే అప్పగిస్తున్నారట. ఇది నచ్చక నేతలు వేరు కుంపటి పెట్టుకుంటున్నారట. ఏ విషయంలోనూ ఎమ్మెల్యేతో టచ్లో లేరట. పార్టీలోని అసంతృప్తులను ఒక గూటికి చేర్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారట. వీరి టార్గెట్ మొత్తం రానున్న స్థానిక ఎన్నికలేనని తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో తమ వరం వారికి గనుక టికెట్ల కేటాయింపులో సమాన వాటా దక్కకపోతే సొంత పార్టీ అభ్యర్థులను ఓడించడానికి కూడ వెనుకాడరని తెలుస్తోంది. ఈ పరిణామమే నిజమైతే గనుక స్థానిక ఎన్నికల్లో నష్టపోవటమే కాదు తర్వాతి ఎలక్షన్లలో జనసేనకో లేదా టీడీపీకో గెలుపు అవకాశాలు పెంచినట్టే. కనుక జగన్ ఈ విషయంలో స్వయంగా చొరవ తీసుకుని అంతర్గత పోరును అదుపులో పెట్టాలి లేకపోతే నష్టమే మిగులుతుంది.