కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. నెల్లూరు నుంచి రెండుసార్లు.. బాపట్ల నుంచి ఒక సారి ఎంపీగా ఎన్నికైన ఆమె.. యూపీఏ హయాంలో పదేళ్ల పాటు కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఆమె.. విభజన తర్వాత ఆమె ప్రభ మసకబారిందని చెప్పాలి.
అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ తీర్థం తీసుకున్న ఆమె.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ మారాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. బుధవారం ఆమె పుట్టిన రోజు వేడుకల్ని భారీ ఎత్తున నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకల్లోనే తనను అభిమానించే నేతలు.. కార్యకర్తల అభీష్టానికి తగ్గట్లు తాను కమలం గూటికి వెళ్లాలన్న నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు.
అందరూ ఈమె అధికార పార్టీ వైసీపీ లోకి చేరుతుంది అనుకున్నారు, కానీ బీజేపీ లోకి జాయిన్ అవుతూ అటు టీడీపీ పార్టీ కి, ఇటు వైసీపీ పార్టీ కి షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి.
బీజేపీలోకి చేరటం ద్వారా.. తిరుపతి ఎంపీ సీటు మీద ఆమె ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. త్వరలో ఈ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు వీలుగా.. ఆమె ముందుస్తుగా ఈ పార్టీలో జాయిన్ అవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమెకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ నేతల తీరుతో అదే పనిగా షాకులు తగులుతున్న చంద్రబాబుకు పనబాక రూపంలో షాక్ తప్పదంటున్నారు.