తన పెద్దమ్మ కొడుకు కోసమే పిసిసి ఉత్తమ్ చీప్ పాలిటిక్స్ (వీడియో)

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పై ఆయన మాజీ డ్రైవర్ మల్లేష్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వివాదం సరికొత్త మలుపులు తిరుగుతున్నది. ఈటల రాజేందర్ ను పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కుట్రలు చేసి బిసి నాయకుడైన ఈటల రాజేందర్ ను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఓయూ జెఎసి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఆరోపించారు.

ఒక బిసి నాయకుడు ఉన్నతమైన విలువలతో రాజకీయాలు చేస్తే రెడ్లు ఓర్వలేరా అని నిలదీశారు బాలరాజు యాదవ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దమ్మ కొడుకు కోసమే ఈటల వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కూటమి పేరుతో తెలంగాణలో రెడ్డి నేతలంతా ఏకమై అన్ని పార్టీల్లో ఉన్న బిసి నేతలను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

హుజూరాబాద్ లో ఈటలపై పోటీ చేయబోతున్న వ్యక్తి ఉత్తమ్ బంధువు కాబట్టే ఈటలను ఇలా అన్ పాపులర్ చేయడం ద్వారా గెలవాలన్న దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నారని బాలరాజు ఆరోపించారు. కూటమి పేరుతో సొంత పార్టీలో బిసి నేతలైన శేర్ లింగంపల్లి భిక్షపతి యాదవ్ కు, జనగామలో పొన్నాల లక్ష్మయ్యకు పొగ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

నిప్పులాంటి ఈటల మీద చిల్లర రాజకీయాలు చేయాలనుకోవడం దురదృష్టకరమన్నారు. ఉద్యమకారుడిగా ఈటల పైకి మాజీ కారు డ్రైవర్ ను ఉసిగొల్పిన ఘటనలో సూత్రదారులు మాత్రం ఉత్తమ్, రేవంత్ రెడ్డిలే అని దూదిమెట్ల విమర్శించారు. బాలరాజు యాదవ్ మాట్లాడిన వీడియో కింద ఉంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.