అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో టీఆర్‌ఎస్ మంత్రి ఈటల రాజేందర్… కొద్ది రోజుల కిందటే పార్టీ నుండి బయటకి వచ్చేసారు. భూకబ్జా ఆరోపణల కారణంగా ఈటలను ఇటీవల కెసిఆర్ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన అనంతరం పార్టీ, ఎమ్మెల్యే పదవులకు ఆయన రాజీనామా చేశారు. దీంతో మొదట్లో ఈటల అడుగు ఏపార్టీ వైపు పడుతుందో అని సందిగ్థత ఉన్నప్పటికీ, కమలం వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ నడిచింది. అనుకున్నట్లుగానే ఆయన ఈ రోజు బీజేపీ పెద్దల సమక్షంలో కమల తీర్థం అందుకున్నారు.
ఇవాళ ఉదయం 6 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంనుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన ఈటల బృందం బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కేంద్ర మంతి ధర్మేంద్ర ప్రదాన్, జి. కిషన్ రెడ్డిల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ, గండ్ర నళిని, అశ్వద్ధామ రెడ్డి కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు.
ఈ సందర్బంగా ఈటల మాట్లాడుతూ…తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామని అన్నారు. పార్టీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా శ్రమిస్తామని తెలిపారు. బీజేపీలోకి రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఈటల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత నేతలతో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇంటికి వెళ్లి ఈటల సమావేశమయ్యారు.