వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రతిపక్షాలు చాలా బలంగా ప్రయత్నిస్తున్నాయి. ఏమాత్రం అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జగన్‌ను లొంగదీసే శక్తి ఎలాగూ తమకు లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేత ఆ పని చేయించాలని చూస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు. కానీ రాష్ట్రానికి సంబంధించి పాలనపరమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అస్సలు వేలు పెట్టట్లేదు. కీలకమైన అమరావతి, మూడు రాజధానుల విషయంలోనే తుది నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానివే అంటూ తేల్చి పారేసిన కేంద్రం కోర్టులతో జగన్ చేస్తున్న పోరాటాన్ని కూడ చూసీ చూడనట్టు ఉంటోంది. అందుకే దేవుళ్లు, దేవాలయాలు అనే అంశాలని పట్టుకున్నాయి ప్రతిపక్షాలు.
రాష్ట్రంలో వరుసగా దేవాలయాల మీద దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పిఠాపురం, అంతర్వేది, నెల్లూరు ఘటనలు తీవ్ర సంచలనం రేపాయి. ఇక తిరుమల విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు పెద్ద వివాదాలైపోతున్నాయి. వీటిని వేలెత్తి చూపిస్తూ రాష్ట్రంలో హిందూ మతం మీద దాడులు జరుగుతున్నాయని, వాటి వెనుక జగన్ ప్రభుత్వం హస్తం ఉందని అంటున్నారు. వరుసగా ఇన్ని దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇవి చాలవన్నట్టు తాజాగా రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లిన ఘటన ప్రభుత్వాన్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.
అంతర్వేది రథం దగ్ధం వివాదంలో ఇప్పటి వరకు అసలు నిందితులను పట్టుకోలేకపోయారు. మొదట్లో ఇవన్నీ మతిస్థిమితం లేని వారు చేసిన పనులని చెప్పిన అధికార పక్షం ఇప్పుడు నోరు మెదపలేకపోతోంది. పైపెచ్చు దాడుల గురించి మాట్లాడే సమయంలో వైసీపీ నేతలు కొందరు చూపిస్తున్న నిర్లక్ష్యం విమర్శలకు దారితీస్తోంది. దేవాలయాల మీద, విగ్రహాల మీద దాడులు జరిగినపుడు కూడ దెబ్బతినని భక్తుల మనోభావాలు వైసీపీ నేతల నిర్లక్ష్యపు మాటల వలన దెబ్బతింటున్నాయి. వీటినే ప్రత్యర్థులు క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల్లో జగన్ సర్కార్ అండతోనే పక్కా పథకం ప్రకారం ఈ దాడులు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.
ఇక ఇప్పుడు కేంద్రాన్ని ఇన్వాల్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. రాములవారి విగ్రహం ధ్వంసం వివాదాన్ని ఇందుకు వాడుతున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణ జరుగుతుంటే ఇలా రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరొందిన రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని, ఈ విషయంలో కేంద్ర హోంశాఖ కలుగజేసుకోవాలని పవన్ కోరారు. అయోధ్య అన్నా, రాముడన్నా బీజేపీకి ఎంత సెంటిమెంటో అందరికీ తెలుసు. అందుకే రామతీర్థం విషయాన్ని కేంద్రం దృష్టిలో పడేలా చేసి ఢిల్లీ నుండి జగన్ కు ఫోన్ వచ్చేలా చేయాలని, అప్పుడుగానీ సీన్ రక్తికట్టదని ప్రతిపక్షాలు భావిస్తున్నట్టున్నాయి.