విపక్షాలు రోడ్లు తవ్వేస్తున్నాయ్: ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా.!

ఇవే, ఇలాంటి ప్రకటనలే అధికార వైసీపీ కొంప ముంచుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సంక్షేమ పథకాల అమలు విషయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపుతూ, ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల సానుకూలత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ, వైసీపీ నేతలు.. అందునా ప్రజా ప్రతినిథులు, పైగా కీలక పదవుల్లో వున్నోళ్ళు, పార్టీని ముంచేయడానికి చూస్తున్నారు.. ప్రభుత్వం ప్రజల దృష్టిలో పలచనయ్యేలా చేస్తున్నారు.

రాష్ట్రంలో రోడ్ల దుస్థితి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వర్షాల ప్రభావంతో రోడ్లు దెబ్బ తింటున్నమాట వాస్తవమే అయినా, వాటిని బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంటుంది. మూడున్నరేళ్ళుగా రాష్ట్రంలో రోడ్లు నానాటికీ మరింత తీసికట్టులా తయారవుతున్నాయి.

అసలు రోడ్లెక్కడున్నాయ్.. గోతులు తప్ప.. అనే పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది. కానీ, రోడ్ల మీద గుంతలకు కారణం విపక్షాలేనంటూ సంబంధిత శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, ఈ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవి. ఈ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమర్థించే పరిస్థితి వుండదు.

రోడ్లు బాగు చేయలేకపోవడానికి కారణాలు చాలా వుండొచ్చుగాక. పాడైపోయిన రోడ్లను బాగు చేసేందుకు తగిన చర్యలు చేపడతామని మంత్రి స్థాయిలో దాడిశెట్టి రాజా ప్రజలకు భరోసా ఇవ్వాలి. అది మానేసి, విపక్షాలు రోడ్లు తవ్వేశాయని అనడమేంటి.? విపక్షాలు రోడ్లు తవ్వేస్తోంటే, ప్రభుత్వం ఏం చేస్తోంది.? అధికారులు, మంత్రులు ఏం చేస్తున్నట్లు.?

రాజకీయాల్లో అధికార పక్షం, విపక్షాలపై ఎదురుదాడి చేయడం మామూలే కావొచ్చు. కానీ, ప్రజలకు ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుస్తాయనీ, ప్రజలు ప్రభుత్వాన్ని ఏవగించుకుంటారనీ, అధికార పార్టీని అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని మంత్రులు తెలుసుకోకపోతే కష్టం. 175 సీట్లూ గెలవాలని వైఎస్ జగన్ అనుకుంటే సరిపోదు.. ఆ దిశగా మంత్రులూ బాధ్యతగా వ్యవహరించాలి.