రాజకీయాల్లో సద్విమర్శలకు రోజులు కావివి. ఇంతింత నోళ్లేసుకుని మీద పడిపోతేనే అందం చందం. అప్పుడే ఒక గుర్తింపు వస్తుంది. ప్రసంగంలో ప్రజలకు పనికొచ్చే మాటలకన్నా బండ బూతులు నాలుగుంటే వాటికే ఎక్కువ కవరేజ్. అలా మాట్లాడితేనే హీరోలు. లేకపోతే సినిమా హీరోలైనా జీరోలే. ఇది అన్యాయం కదా అని ప్రశ్నిస్తే నీకేం అర్హత ఉంది అంటారు. రాజకీయాల్లోకి వస్తే నీకంత సీన్ లేదంటారు. ఇవి ఈనాటి రాజకీయ పరిస్థుల మీదున్న అంచనాలు, అర్హతలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఇప్పటివరకు పవన్ మీద ప్రజా ప్రయోజనాలకు ఆటంకం కలిగిస్తున్నారనే బలమైన ఆరోపణ ఒక్కటి కూడ చేయలేకపాయిన ప్రత్యర్థులు పైన చెప్పుకున్న విపరీతాలనే మళ్ళీ మళ్ళీ వల్లే వేస్తున్నారు. అసాధారణ, భావోద్వేగపూరిత రాజకీయ పరిస్థితుల నడుమ మొదటిసారి ఎన్నికల్లోకి దిగిన పవన్ చిత్తుగా ఓడారు.
దురదృష్టం మరీ వెంటాడి స్వయంగా పోటీచేసిన రెండు చోట్లా గెలవలేకపోయారు. ఈ ఓటమితో ఆయన మీద ఒక పర్మనెంట్ లూజర్ అనే ముద్ర వేయడానికి చాలానే ప్రయత్నించారు. పవన్ తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయాన్నీ తప్పుబట్టారు. ఆ నిర్ణయాలు ఆయన పార్టీకి చేటు చేస్తే చేయవచ్చుగాక ప్రజల మీద ఎలాంటి ప్రభావాన్నీ చూపలేవు. ఎందుకంటే పవన్ పాలనలో భాగం కాదు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడ వైసీపీకి మద్దతిస్తున్నారు. కాబట్టి పవన్ తీసుకునే పార్టీ పరమైన నిర్ణయాలు ప్రజాప్రయోజనాలు ఏ విధంగానూ నష్టపరచవు. ఇక పోరాటాలు, నిలదీతలు, పర్యటనలు లాంటివి చేస్తే అవి ప్రజలకు మంచి చేసినా చేయకపోయినా చెడు మాత్రం తలపెట్టవు. ఇన్ని వాస్తవాలు కళ్లముందు ఉన్నా ప్రత్యర్థులు మాత్రం పవన్ దండుగాని, రాజకీయ క్రీడలో ఒక పావు మాత్రమేనని అంటున్నారే కానీ ఏనాడూ ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు.
ఏదైనా ఇష్యు మీద పవన్ మాట్లాడితే నువ్వు చంద్రబాబు మనిషివి, బీజేపీకి తొత్తువి, వారి కోసమే పనిచేస్తున్నావ్ అంటారే తప్ప సమాధానం ఇచ్చి పవన్ ను సైలెంట్ చేద్దాం అనుకోరు. తాజాగా పవన్ నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకీ పంట నష్టం పరిహారం కింద 35 వేల రూపాయల్ని అందించాలని కృష్ణా జిల్లా కలెక్టరును కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా 35 వేలు ఇవ్వని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తాం అంటూ తనపై మాటలా దాడి చేసే నాయకుల మీద విమర్శలు గుప్పించారు. సిసలైన నాయకులైతే పరిహార కింద 35 వేలు ఇస్తారా ఇవ్వరా. ఇవ్వము అంటే ఎందుకివ్వరు. అంతకు మించి సహాయం చేశాం అంటే కనిపించని ఆ సహాయం ఏంటి అని వివరణ ఇవ్వాలి.
కానీ అలా చేయరు కదా. అందుకే చిత్రమైన విశ్లేషణలు స్టార్ట్ చేశారు. అధికార పార్ట్ అనుకూల మీడియా వర్గాలు పవన్ అన్న చిరంజీవి ఎందుకు ఓడిపోయారో వివరిస్తూ రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే డబ్బుండాలని, కన్నింగ్ బ్రెయిన్ ఉండాలని, 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికలు నడపగల ఆర్థిక బలం ఉండాలని, ఓటరుకు 5 వేలు ఇచ్చే సత్తా ఉండాలని, ప్రాణం పెట్టే కార్యకర్తలు, నేతలు ఉండాలని ఏవేవో మాట్లాడారు. అవన్నీ లేవి పవన్ ఎప్పటికీ రాజకీయాల్లో నెగ్గుకురాలేదని తేల్చిపారేశారు. తమ వద్ద లేవని అనుకున్నారో ఏమో కానీ నిజాయితీ, బాధ్యతల గురించి మాట్లాడలేదు. మొత్తంగా పవన్ విసిరిన అల్టిమేటంకు అవతలివారి అనుకూల మీడియా నుండి వచ్చిన సమాధానమల్లా పవన్ దగ్గర డబ్బు లేదు. మనీ పాలిటిక్స్ చేయలేడు. రాజకీయ ఎత్తుగడలు వేయలేడు. కాబట్టి నో యూజ్ అని మాత్రమే. మరి సమస్యలను లేవనెత్తినప్పుడు ఇలాంటి పొంతన లేని విశ్లేషణలు చేసే వాళ్ళను ఏమనాలో అర్థంకాని పరిస్థితి.