చిలుకలూరిపేటలో నేను రెడీ : ఎన్నారై రజిని సవాల్ (వీడియోలు)

ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ఆంధ్రా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల తరుపున పోటీ చేసేందుకు లీడర్లు తమ పలుకుబడిని చూపించుకుంటున్నారు. ఎదుటి వాళ్లకు సవాళ్లు విసురుతూ నిత్యం వార్తల్లో ఉండేందుకు పోటీ పడుతున్నారు. చిలుకలూరిపేటలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు ఎన్నారై మహిళ రజిని విడదల. తాను రాజకీయాల కోసమే అమెరికా నుంచి ఇండియా వచ్చానని ప్రకటించుకున్నారు. 2019 లో టిడిపి మీద పోటీ చేస్తానని ఆమె సవాల్ విసురుతున్నారు. రజిని విడదల గురించి స్టోరీ చదవండి.

చిలకలూరిపేట నుండి టీడీపీతో పోటీకి సిద్ధం అంటూ సవాల్ విసిరారు ఎన్నారై మహిళ రజిని విడదల. పది నెలల క్రితం కుటుంబంతో సహా అమెరికా నుండి చిలకలూరిపేటకు తిరిగి వచ్చారామె. ప్రస్తుతం ఇక్కడే వీఆర్ ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడే స్థిరపడనున్నట్లు చెబుతున్నారు. రాజకీయాల్లోనే పనిచేస్తానని చెబుతున్నారు. తన భవిష్యత్ కార్యాచరణను ఆమె మీడియా ముందు వివరించారు.

రెండు వారాల క్రితం వైసిపి అధినేత జగన్ ను కలిసినట్లు చెప్పారు. ఆయనతో చిలుకలూరిపేట రాజకీయ విషయాలతో పాటు అనేక విషయాలు చర్చించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్య ప్రత్యేక హోదా అన్నారు. గతంలో ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అని చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారంటూ ఆమె బాబుపై మండి పడ్డారు. వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నారన్నారు. హోదా వచ్చే వరకు జగన్ మడమ తిప్పని పోరాటం చేస్తూనే ఉంటారు అని చెప్పారు. జగన్ చేపట్టే కార్యక్రమాలలో ఎప్పుడు తన మద్దతు ఉంటుంది అని ప్రకటించారు.

త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని వివరించారు. జగన్ అడుగుజాడల్లో నడుస్తానని ఆమె తెలిపారు. రానున్న ఎన్నికలలో చిలకలూరిపేట నుండి పోటీ చేయనున్నట్లు ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు. టీడీపీలో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి మినిస్టర్ స్థాయిలో ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుని ఢీ కొనడం స్థానికులవలనే కాలేదు..మీవల్ల ఎలా అవుతుంది అనుకుంటున్నారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె ఘాటుగా స్పందించారు. చిలకలూరిపేటలో చంద్రబాబునాయుడు ఏ నాయకుడిని నిలబెట్టినా వారిని ఢీ కొనే దమ్ము, సత్తా నాకుంది అని చాలెంజ్ చేశారు రజిని విడదల.

అయితే టిడిపి రాజకీయాలు ఆమెకు నచ్చకపోవడంతో పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో మహానాడు వేదికగా ఆమె వైసిపి జగన్ కు సవాళ్లు విసిరిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చినందున త్వరలోనే వైసిపిలో చేరి పోటీకి రెడీ అవుతానని అన్నారు. ప్రస్తుతం రజిని విడదల సేవా కార్యక్రమాల్లోనూ దూసుకుపోతున్నారు. తన ఇంటి తలుపుతట్టిన ప్రతి వారికి చేతనైన సాయం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె ఎలాంటి సేవలు చేస్తున్నారో స్థానికంగా ఒక టివి చానెల్ తో మాట్లాడుతూ చెప్పారు. ఆ వీడియో కింద ఉంది చూడండి. రజని విడుదల గతంలో తెలుగుదేశం పార్టీలోనూ పనిచేశారు.