ఏపీలో పొత్తులపై కిం కర్తవ్యం.! బంతి బీజేపీ కోర్టులోనే.!

టీడీపీ, జనసేనతో కలిసి వెళ్ళాలా.? ఒంటరిగా బరిలోకి దిగాలా.? వైసీపీని కలుపుకుపోతే ఎలా వుంటుంది.? భారతీయ జనతా పార్టీలో అంతర్గత మధనం.. కాదు కాదు, అంతర్గత కల్లోలమే కనిపిస్తోంది ఈ అంశంపై.

నిజానికి, బీజేపీ ఆందోళన ఆంధ్రప్రదేశ్ గురించి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో తమ స్థానమేంటో బీజేపీకి బాగా తెలుసు. బీజేపీ ఆందోళన అంతా తెలంగాణ గురించే. తెలంగాణలో పట్టు చిక్కినట్టే చిక్కి, జారిపోతోందన్న ఆవేదన బీజేపీ అధినాయకత్వంలో కనిపిస్తోంది.

కీలక సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మార్చడం ద్వారా తెలంగాణ సమాజానికి కమలం పార్టీ ఏం సంకేతాలు పంపినట్టు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. తెలంగాణలో టీడీపీ, జనసేన.. ఈ రెండు పార్టీల అవసరం బీజేపీకి వుంది.

ఆ బంధం ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతుందా.? అంటే, ఒకేసారి ఏపీ – తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే తప్పదు. ఒకవేళ అలా కుదరకపోతే మాత్రం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు టీడీపీ – జనసేన పార్టీలని కలుపుకుపోయి, ఆ తర్వాత చేతులు దులుపుకుపోవచ్చు.

బీజేపీ జాతీయ నాయకత్వం కిందా మీదా పడుతోన్నది ఇక్కడే.! వాడుకుని, అవసరం తీరాక డంప్ చేయడమే బెటర్.. అన్న ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం వుందట. అందుకే, ముందస్తు ఎన్నికల ఆలోచన లేదు కదా.. అని పదే పదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర బీజేపీ పెద్దలు క్లారిటీ తీసుకుంటున్నారట.

‘ఏపీలో మాతో కలవకపోయినా ఫర్లేదు.. వాళ్ళతో కలవకుండా వుంటే అదే చాలు..’ అని వైఎస్ జగన్, బీజేపీ ముందుంచుతున్న ప్రతిపాదన, బీజేపీకి పెద్దగ ఇబ్బంది లేనిదే.. నష్టం కలగజేయనిదే.! మరి, బీజేపీ నిర్ణయం ఎలా వుంటుందో.!