ఇప్పుడు పవన్‌ కల్యాణ్ ఆత్మ ఆయనే…

స్థాయికి మించిన మాటలు.. స్థిరత్వం లేని వ్యాఖ్యలు.. దశదిశా లేని రాజకీయ వైఖరులతో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని పవన్‌ కళ్యాణ్‌కు ఇప్పుడు అన్నీ తానైన ఆత్మ లాంటి వ్యక్తి ఒకరు దొరికారు. ఒక వారం పది రోజులుగా  పవన్ ఉపన్యాసాల్లో తేడా వుంటుండి. మామూలుగానే ఆయన తేడా సింగ్. ఇపుడు సడన్ డైరెక్షన్ మారింది. దానికి కారణం ఆత్మయే  అని అందరి అనుమానం.

ఆయన చెప్పినట్లే చేస్తూ, ఆయన సూచించినట్లే కొద్దిరోజులుగా పవన్‌ ప్రతిపక్ష నేత జగన్‌పై ఎడాపెడా రాళ్లు వేస్తున్నారు. ఆయన ఎవరో కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్‌. ప్రస్తుతం పవన్‌ వ్యూహాలు, మాటల వెనుక ఉన్నది ఆ మనోహరమే. 

మనోహర్‌ జనసేనలో చేరిన తర్వాతే పవన్‌ ప్రసంగాలు, వ్యూహాల్లో మార్పు వచ్చింది. నాలుగేళ్లు చంద్రబాబును భుజాన మోసిన పవన్‌ కొన్ని నెలల క్రితం మంగళగిరిలో జరిగిన సభలో హఠాత్తుగా ప్లేటు మార్చి ఆయన వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు.

 

చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం మొదలు పెట్టాడు. చంద్రబాబుతో కలిసి ఉన్నప్పుడు జగన్‌ను విమర్శించినా తేడా వచ్చాక ఆయనపై విమర్శలు మానేశాడు.

కానీ తాజాగా వారం పదిరోజుల నుంచి మళ్లీ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాడు. ఇన్నాళ్లూ లేకుండా ఒక్కసారిగా జగన్‌పై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడనేది రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. పవన్‌ ఈ కొత్త వైఖరికి కారణం నాదెండ్ల మనోహరే అంటున్నారు. ఆయన  బోధన వల్లే  చంద్రబాబు కంటె జగన్‌ను ఎక్కువగా లక్ష్యం చేసుకుని తిడుతున్నాడని సర్వత్రా వినబడుతూ ఉంది. బాబు, జగన్‌లు ఇద్దరికీ తాను వ్యతిరేకమని చూపించుకునేందుకు మనోహర్‌ ఈ వ్యూహాన్ని అమలు చేయిస్తున్నట్లు జనసేన వర్గాల జస్టిఫికేషన్.

 సభలు, సమావేశాల సమయంలో పవన్‌ పక్కనే నాదెండ్ల మనోహర్‌ నీడలా వెన్నంటి ఉంటున్నాడు. మనోహర్‌ లేకుండా పవన్‌ కనిపించడం లేదు. ఆయన లేకుండా ఈయన  ఏ సమావేశానికి హాజరుకావడంలేదు.  పవన్  మాట్లాడుతున్నపుడు జాగ్రత్తగా గమనించండి.  చాలాసార్లు మనోహర్‌ వెనుక నుంచి పవన్‌కు డైలాగులు అందిస్తుండడాన్ని గమనించవచ్చు. దీన్నిబట్టి  ప్రస్తుతం పవర్‌స్టార్‌ను నడిపించే ఆత్మ మనోహర్‌ అని స్పష్టమవుతోంది. పవన్ కు నాదెండ్ల మీద గురి కుదిరింది. ప్రపంచంలో ఇంత మేధావులున్నారా అని పవన్ ఆవ్చర్యపోతున్నట్లుగా కనిపిస్తుంది, ఆయనలో నాదెండ్ల తీసుకువచ్చిన మార్పు చూస్తే.

.

మనోహర్‌ ఎందుకు జగన్‌పై ఉన్నట్టుండి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయిస్తున్నాడనే దానికి బలమైన కారణాలున్నాయి. జనసేనతో పొత్తుకు జగన్‌ ఏమాత్రం అంగీకరించలేదు. జనసేనను ఒక పార్టీగా సైతం జగన్‌  గుర్తంచడం లేదు. జనసేన ప్రస్తావన వచ్చినపుడు ఆయన ఎలా తీసి పారేస్తా డో ఒక సారి గుర్తుచేసుకోండి.
జగన్‌తో పొత్తుకు పవన్‌ సిద్ధమై  30-40  సీట్ల ప్రతిపాదనలతో వైసీపీ కాపు నాయకులతో చర్చలు కూడా జరిపించారు. కానీ అవన్నీ జగన్‌ వద్దకెళ్లేసరికి వీగిపోయాయి. పవన్‌ ఎప్పటికైనా బాబు మనిషే, బాబు పంపిన డబ్బుతోనే పర్యటనలు చేస్తున్నాడు,  ఎన్నికలయ్యాక ఆయన వెంటే ఈ స్టార్‌ నడుస్తాడనేది జగన్‌కు ఉన్న కచ్చితమైన అభిప్రాయమట. అందువల్లే పవన్‌కు ఎన్ని సీట్లిచ్చినా అవి మళ్లీ బాబుకే దాఖలు పడతాయనే ఉద్ధేశంతో అతన్ని దగ్గరకు రానీయడం లేదు. 

 కానీ పొత్తు కోసం మనోహర్‌ సైతం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. పొత్తు ఉంటే కనీసం కొన్ని సీట్లయినా దక్కుతాయని, తానైనా గెలిచే అవకాశం ఉంటుందని ఆయన ఉద్ధేశం.పవన్‌ అంతరంగమూ ఇదే. కానీ జగన్‌ను పడనీయలేదు. ఇది పవనన్నకు నచ్చడం లేదు.రిలీజై న కొత్త సినిమాకు ఈల లేస్తూ పరిగెత్తే  పోరగాళ్లలాగా  జగన్ తనదగ్గరికి వస్తాడని పవన్,నాదెండ్ల ఆశపడ్డారు. జగన్ లెక్క చేయకపోయేసరికి పవన్ కు కోపమొచ్చింది. జగన్‌పై ఉన్నఈ  కోపంతోనే   నాదెండ్ల మనోహర్‌ సూచనలతో పవన్‌ కొద్దిరోజులుగా ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేస్తున్నాడు. బాబు, జగన్‌లు ఇద్దరిని తిట్టడం ద్వారా తటస్థుల ఓట్లయినా పడతాయనే ఆశ కూడా అందులో ఉంది. దీనంతటికీ వ్యూహకర్త నాదెండ్ల మనోహర్‌ కావడం గమనార్హం.