టాయిలెట్ల మీద తండ్రీ, కొడుకుల రంగుల లొల్లి..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేకుండా పోయింది. వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ప్రస్తుతం కరోనా వంటి క్లిష్ట పరిస్థితులలో కూడా వైరస్‌ని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటూనే, మరోపక్క సాధారణ సంక్షేమం, అభివృద్దిపై కూడా దృష్టి సారిస్తున్నారు.

అయితే ఇటీవల మహిళల సౌకర్యార్ధం కోసం సంచార బయో టాయిలెట్లను తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో పాత ఆర్టీసీ బస్సులను టాయిలెట్లగా మార్చాలని ప్రభుత్వం భావించింది. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు వీటికి వేసే రంగుల విషయంలో మాత్రం రోజుకో మాట వినబడుతుంది. అయితే ఏపీలో వైసీపీ రంగుల మాదిరి వివాదస్పదం కాకపోయినా తండ్రీ, కొడుకుల మధ్య మాత్రం చిన్నపాటి లొల్లి నడుస్తుంది. పూర్తి వివరాలలోకి వెళితే పాత ఆర్టీసీ బస్సులను మహిళల కోసం సంచార బయో టాయిలెట్లుగా మార్చి వాటికి ఆకుపచ్చ రంగు వేసి ఇటీవల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు.

అయితే మంత్రి కేటీఆర్ మాత్రం ఆ బస్సులకు పింక్ రంగు కలర్ వేయమని ఆదేశాలు ఇచ్చారు. దీంతో గ్రీన్ కలర్‌లో ఉన్న బస్సులన్నిటికి పింక్ కలర్ వేసి అన్ని మున్సిపాలిటీలలో తిప్పేందుకు సిద్దం చేశారు. ఇంతలోనే ఈ టాయిలెట్ల వ్యవహారం పై స్పందించిన సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌కి ఫోన్ చేసి బస్సులకు గులాబి రంగులు ఉండకుండా చూడలన్నారు. దీంతో వెంటనే ఆ బస్సుల రంగులు మార్చాలని పువ్వాడ అధికారులను ఆదేశించారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి మహిళలకు సింబాలిక్ పింక్ కలర్ కాబట్టి కేటీఆర్ బస్సులకు పింక్ కలర్ వేయించాలని అనుకున్నాడేమో,

ఇక పింక్ కలర్ టీఆర్ఎస్ రంగు కావడంతో బస్సులకు పింక్ కలర్ వేయిస్తే టాయిలెట్ల పై కూడా పార్టీ రంగులు వేయించుకున్నారు అని ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉందని గ్రహించి సీఎం కేసీఆర్ బస్సులకున్న పింక్ కలర్ మార్చమని ఆదేశించినట్టున్నారు. విషయం ఏదైనా తండ్రీ కొడుకులకు తెలియకుండానే టాయిలెట్ల రంగుల విషయంలో లొల్లి నడిచినట్టుంది.