ఏపీ విద్యా సంస్కరణలు… నోబెల్ అవార్డు గ్రహీత కీలక వ్యాఖ్యలు!

ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో పెను మార్పులు తీసుకొచ్చారని.. విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలకు నాంధి పలికారని కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీలో విద్యా సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ఫ్రొఫెసర్ మైకేల్ క్రేమెర్ ప్రశంసలు గుప్పించారు.

అవును… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని, కచ్చితంగా ఇది గొప్ప విషయమనే కాకుండా ఆదర్శవంతమైన విషయమని నోబెల్ అవార్డు గ్రహీత ఫ్రొఫెసర్ మైకేల్ క్రేమెర్ ప్రశంసల జల్లులు కురిపించారు. తాజాగా సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి మైకేల్ క్రేమెర్‌ తోపాటు చికాగోలోని డీఐఎల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ క్యుపిటో బృందం సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావులు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు. అనంతరం నోబెల్ అవార్డు గ్రహీత మైకేల్ క్రేమెర్ తోపాటు చికాగో యూనివర్శిటీ బృందాన్ని సత్కరించారు.

ఈ పర్యటనలో భాగంగా… సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో “పర్సనలైజ్‌డ్ అండ్ అడాప్టివ్ లెర్నింగ్ (పాల్)” ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలలను ఈ బృందం సందర్శించనుంది. ఇదే క్రమంలో మూడు రోజుల పాటు ఏలూరు జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించనున్నారు.

ఈ “పాల్” ప్రాజెక్టు అమలుపై స్పందించిన ఈ బృద్మం… ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రాముఖ్యతగా నిలిచిందని అన్నారు. విద్యార్థుల మనోవికాసానికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని మైకేల్ క్రేమెర్ కొనియాడారు.

దీంతో సాక్ష్యాత్తు నోబెల్ అవార్డు గ్రహీతలు ఇలా ఏపీని సందర్శించడం.. ఏపీలో విద్యా వ్యవాస్థలో జగన్ తీసొస్తున్న సమూల మార్పులను గ్రహించి, అర్ధం చేసుకుని స్పందించడం.. అభినందించడం నిజంగా రాష్ట్రప్రభుత్వానికి గొప్ప అభినందన అని అంటున్నారు విశ్లేషకులు!