మాకొద్దు జగనన్న.. మళ్ళొద్దు చంద్రన్న: జనసేన కొత్త నినాదం?

Janasena New Slogan

‘బై బై బాబు..’ అంటూ 2019 ఎన్నికలకు ముందర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ ఆసక్తికరమైన నినాదాన్ని తెరపైకి తెచ్చింది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ నినాదాన్ని తీసుకొచ్చారని అంటారు. సరే, ఆ నినాదం క్రెడిట్ ఎవరిది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, అప్పట్లో ఈ నినాదం సూపర్ హిట్టు.!

ఔను, ‘బై బై బాబు’ అనే నినాదం సక్సెస్ అవడం వల్లే, తెలుగుదేశం పార్టీ అధికారారన్ని కోల్పోయింది. మరి, 2024 ఎన్నికల్లో ఏ నినాదం హైలైట్ కాబోతోంది.? చంద్రబాబు అయితే, ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటున్నారు. వైసీపీ కూడా పలు నినాదాలు తెరపైకి తెస్తోంది, ‘చంద్రబాబుని పూర్తిగా ఇంటికి పంపెయ్యండి’ అనడం ద్వారా.

సందట్లో సడేమియా, జనసేన కూడా ఓ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అదే, ‘మాకొద్దు జగనన్న.. మళ్ళొద్దు చంద్రన్న..’ అనే నినాదం. ఈ నినాదం ఇప్పుడు గ్రామ స్థాయిలో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. బూత్ స్థాయిలోకి ఈ నినాదాన్ని తీసుకెళ్ళేందుకు జనసైనికులు ప్రయత్నిస్తున్నారు.

వాస్తవానికి ఇది జనసేన పార్టీ అధికారిక నినాదం కాదు. కాకపోతే, పవన్ కళ్యాణ్ అభిమానులు, దీన్ని ఓ ఉద్యమ నినాదంలా మార్చేస్తున్నారు. సొంత ఖర్చులతో కరపత్రాలు రూపొందిస్తున్నారు. ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా హైలైట్ చేస్తున్నారు.

రాజకీయాల్లో ఇలాంటి నినాదాలు అనూహ్యంగా ఆయా రాజకీయ పార్టీలకు షాక్ ఇస్తుంటాయి. జనాల్ని ఆలోచింపజేస్తుంటాయి. సంక్షేమ పథకాలతో తాము అద్భుతమైన పాలన అందిస్తున్నామని వైసీపీ అంటోంటే, అప్పులు చేసి డబ్బులు పంచడం పాలన ఎలా అవుతుందనే చర్చ జనంలోనూ జరుగుతోంది.