‘కేసీయార్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారు కదా.?’, అన్న ప్రశ్నకి.. ముందైతే తెలంగాణలో ఏం చేస్తారో చూద్దాం.. అనేశారు వైఎస్ విజయమ్మ. అంతేనా, తెలంగాణలో చేతకానిది దేశంలో ఏం చేస్తారు.? అని కూడా వైఎస్ విజయమ్మ ఎద్దేవా చేసేశారు. అసలేంటి వైఎస్ విజయమ్మ ధీమా.?
త్వరలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రచారమేముంది.? ఆమె బాధ్యతలు తీసుకున్నా తీసుకోకున్నా వైఎస్సార్ తెలంగాణ పార్టీలో అత్యంత కీలక నేత. నిజానికి, వైఎస్ షర్మిల కంటే విజయమ్మకు రాజకీయంగా అనుభవం ఎక్కువ. ఆమె గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగానూ పనిచేశారు.
అన్నిటికీ మించి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనిచేస్తున్నప్పుడు.. అంతకు ముందు ఆయన ప్రతిపక్ష నేతగా వున్నప్పుడూ.. రాజకీయాల్ని దగ్గరగానే చూశారు వైఎస్ విజయమ్మ.
అందుకే, ఆ అనుభవంతోనే తెలంగాణలో కేసీయార్ పనైపోయిందన్నట్లుగా వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పేశారు. అంతే కాదు, ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎవరూ టచ్ చేయలేరని అంటున్నారు వైఎస్ విజయమ్మ. అయితే, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చుననుకోండి.. అది వేరే సంగతి.
కాగా, వైసీపీ శ్రేణులు మాత్రం విజయమ్మ వ్యాఖ్యలతో ఆకాశంలో విహరిస్తున్నారు. మొన్నటికి మొన్న ‘వైఎస్ జగన్ గురించీ, ఏపీ గురించీ మనకెందుకు..’ అనేశారు విజయమ్మ. కానీ, ఇప్పుడు ఆమె టోన్ మారింది. పైగా, వైసీపీ నుంచి ‘సమైక్యాంధ్రప్రదేశ్’ అన్న ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావనను షర్మిల ఖండించినాగానీ, విజయమ్మ కూడా సమైక్య జెండా ఎత్తుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఇదిలా వుంటే, వైఎస్ షర్మిల విషయంలో టీఆర్ఎస్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఆగండాగండీ.. అదిప్పుడు టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్.! షర్మిలకు బీఆర్ఎస్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే, అంతలా తెలంగాణలో బీఆర్ఎస్ దెబ్బ తింటుంది. ఆల్రెడీ షర్మిల కారణంగా కేసీయార్ దెబ్బతిన్నారన్న భావన విజయమ్మ మాటల్లో కనిపిస్తోంది.