గత ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కొట్టుకుపోయిన కొన్ని జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడ ఒకటి. మొదటి నుండి రెడ్డి సామాజికవర్గం ప్రాభల్యం ఎక్కువగా ఉండే నెల్లూరు జిల్లాలో ఒప్పుడు కాంగ్రెస్ ఆ తరవాత వైసీపీ హవా నడుస్తున్నాయి. మధ్యలో తెలుగుదేశం పట్టు సాధించడానికి ప్రయత్నించినా అది పూర్తిస్థాయిలో సాధ్యపడలేదు. అయినా పార్టీ ఉనికికి మాత్రం ఎలాంటి ఢోకా ఉండేది కాదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద మస్తావ్ రావు, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి లీడర్లు బలంగా ఉండేవారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవులు లేకపోయినా వీరి హవా నడిచేది. కానీ క్రమంగా వారి పలుకుబడి కూడ తగ్గిపోయింది. వైసీపీలో బలమైన నేతలు తయారవడంతో మొత్తం 10 ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఎక్కడా తేడా లేకుండా పూర్తిగా వైసీపీ అభ్యర్థులంతా భారీ మెజారిటీతో గెలిచ్చారు.
ఇక ఎంపీ స్థానాలు కూడ పూర్తిగా వైసీపీ వశమయ్యాయి. అందుకే జగన్ సైతం జిల్లా నుండి ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు కల్పించారు. జిల్లాలో ఒక్కొక నేత ఒకో ఫైర్ బ్రాండ్ అన్నట్టు తయారయ్యారు. వారి దూకుడు ముందు తెలుగుదేశం నేతలు అస్సలు నిలబలేకపోతున్నారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని కాచుకునే నేతలే కరువయ్యారు. వాటిలో ఆత్మకూరు నియోజకవర్గం కూడ ఒకటి. ఒకప్పుడు ఇక్కడ టీడీపీకి కొమ్మి లక్ష్మయ్య నాయుడు లాంటి బలమైన నేత ఉండేవారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా, టీడీపీ తరపున ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరవాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన కూడ పార్టీని వీడారు. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి తిరుగులేని నేతగా ఎదిగిపోయారు.
ప్రజెంట్ ఆయన జగన్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అంటే ప్రత్యర్థుల ఆటలు ఏమాత్రం సాగవనేది అందరికీ తెలిసిన సంగతే. 2014లో ఇక్కడ అభ్యర్థులు దొరక్క చివరికి గుటూరు మురళి కన్నబాబుకు సీట్ ఇచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన నెగ్గలేకపోయారు. గత ఎన్నికల్లో సీనియర్ నేత బొల్లినేని కృష్ణయ్యకు అవకాశం ఇవ్వగా ఆయన కూడ 22 వేల ఓట్ల తేడాతో ఓడారు. ఎన్నికల తర్వాత ఆయన పార్టీని పట్టించుకోవడం మానేశారు. దీంతో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని తెరపైకి తేవాలనే ప్రయత్నంలో ఉన్నారు. రాఘవేంద్రరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత అయిన బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కుమారుడు.
ఈయనకు మంచి కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ వ్యక్తిగత ఇమేజ్ లేదు. వేరే ప్రత్యామ్నాయం లేక పార్టీ పగ్గాలు ఇవ్వాల్సి వస్తోందట. అసలే గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. పైపెచ్చు ఆయనకు జగన్ మద్దతు పూర్తిస్థాయిలో ఉంటోంది. ఆత్మకూరులోనే కాకుండా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అలాంటి నేతను ఢీకొట్టడం రాఘవేంద్రరెడ్డికి అయ్యే పనేనా అనే సందేహం బభౌ మదిలో మెదులుతూనే ఉందట. తెలుగుదేశం శ్రేణులకైతే భవిష్యత్తులో ఇక్కడ పార్టీ పుంజుకుంటుందనే నమ్మకాలు ఏ కోశానా లేవు.