‘ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోం.. తొమ్మిది నెలలే సమయం వుంది ఎన్నికలకి. కష్టపడి పని చేస్తే మళ్ళీ గెలుపు మనదే. ఖచ్చితంగా 175 సీట్లలోనూ గెలుస్తాం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి..’ ఇదీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సహచర మంత్రులకు తేల్చి చెప్పిన విషయం.
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనీ, ఈ మంత్రివర్గ సమావేశంలోనే అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని వైఎస్ జగన్ తీసుకుంటారనీ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, టీడీపీ అను‘కుల’ మీడియా ఆశించినట్లు ఏమీ జరగలేదు.
ముందస్తు ముచ్చటే లేదని వైఎస్ జగన్ తేల్చి చెప్పేయడంతో తెలుగుదేశం పార్టీ ఒకింత డీలా పడింది. జనసేన మాత్రం ఊపిరి పీల్చుకుంది. ఔను, జనసేన పార్టీ ఇంకా ఎన్నికలకు సమాయత్తం కావాల్సి వుంది. టీడీపీ అయితే, ఎన్నికలకు సిద్ధంగానే వుంది.
ఇంతకీ, వైఎస్ జగన్ వ్యూహమేంటి.? తొమ్మిది నెలల సమయం వుంది గనుక, 2019 ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని హామీల్లో ఏవైనా పెండింగ్ వుంటే, వాటిని క్లియర్ చేసేసుకోవడానికి ఇది సరైన సమయం అని ఆయన భావిస్తున్నారట.
కేంద్రం నుంచి ఎడా పెడా నిధులు కూడా వస్తుండడంతో, సంక్షేమంతోపాటు అభివృద్ధిపైనా ఫోకస్ పెట్టాలనీ, ఓట్లు తెచ్చే కార్యక్రమాలు మరింత బలంగా చేయాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయినాగానీ, ముందస్తు ఎన్నికలు తప్పవన్న చర్చ మాత్రం, మీడియా రాజకీయ వర్గాల్లో జరుగుతూనే వుంది.