‘వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించింది.. తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం. అంతే తప్ప, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వెళ్ళడానికి కాదు..’ అంటున్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.
‘నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడంలేదు. మరో పార్టీలోకీ వెళ్ళడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అస్సలు ఆసక్తి లేదు. తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తాను..’ అంటూ వైఎస్ షర్మిల స్పష్టతనిచ్చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో షర్మిల విలీనం చేసెయ్యబోతున్నారనీ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతోందనీ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆమెకు ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం దక్కబోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరవెనుకాల స్క్రీన్ ప్లే రచించినట్లుగా ఊహాగానాలు వినిపించాయి.
ఈ ప్రచారాన్ని కాస్త లేటుగానే అయినా, వైఎస్ షర్మిల ఖండించారు. తెలంగాణలోనే వుంటాననీ, తెలంగాణ రాజకీయాల్లోనే తన రాజకీయ భవిష్యత్తు అని షర్మిల పేర్కొన్నారు. తెలంగాణలో కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు చెప్పారు.
సుదీర్ఘ పాదయాత్రను తెలంగాణలో చేసినా, వైఎస్ షర్మిలకు రాజకీయంగా తెలంగాణలో మైలేజీ వచ్చింది లేదు. ఈ నేపథ్యంలో ఆమె వైఎస్సార్ తెలంగాణ పార్టీని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారన్న ప్రచారం జరగడంలో వింతేముంది.?