టీడీపీ గాలి తీసేసిన బీజేపీ నేత.! పొత్తు లేదని తేల్చేశారే.!

పాపం తెలుగుదేశం పార్టీ.. ఎగిరెగిరి పడింది.. కాదు కాదు, టీడీపీ అనుకూల మీడియా చంకలు గుద్దుకుంది బీజేపీ – టీడీపీ పొత్తు ఊహాగానాలపై. ఢిల్లీ నుంచి వచ్చిన లీకుల దెబ్బతో టీడీపీ అను’కుల’ మీడియా సంబరాలు చేసుకోగా, ఆ మీడియాపైనా, టీడీపీపైనా నీళ్ళు చల్లేశారు తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్.

‘మేం, ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో మాత్రమే పొత్తులో వున్నాం. ఆ పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం. టీడీపీతో చర్చలు జరగలేదు, జరగబోవు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది..’ అని బీజేపీ నేత లక్ష్మణ్ తేల్చి చెప్పేశారు. ఆయనిప్పుడు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పైగా, బీజేపీ అధిష్టానంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి ఆయనకి.

బీజేపీ మీడియా కథనాలు ఉత్తవేనా.? అన్న ప్రశ్న ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. బీజేపీ అధిష్టానం నుంచి ఖచ్చితమైన సమాచారం లేకుండా ‘రిపబ్లిక్’ అనే ఛానల్, బీజేపీకి సంబంధితమైన కీలక అంశానికి సంబంధించి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చే అవకాశమే లేదు.

ఎందుకంటే, రిపబ్లిక్ ఛానల్ వెనకాల వున్నది బీజేపీనే. ఆ ఛానల్ పనే.. బీజేపీని ఎలివేట్ చేయడం. బీజేపీకి అనుకూలంగా వార్తల్ని ప్రసారం చేయడం, బీజేపీయేతర రాజకీయ పార్టీలపై బురద చల్లడం. ఒక్కమాటలో చెప్పాలంటే, రిపబ్లిక్ ఛానల్ కేవలం బీజేపీ కోసం పుట్టింది.

అలాంటి రిపబ్లిక్ ఛానల్‌లో వచ్చిన కథనమెలా తప్పవుతుంది.? అన్నది టీడీపీ డౌటానుమానం. ఏమో, చీకట్లో ఓ రాయి విసిరినట్టుంది బీజేపీ. బీజేపీ – టీడీపీ పొత్తు.. అనే లీకులు పంపగానే, ఫీడ్ బ్యాక్ చాలా దారుణంగా వచ్చి వుండొచ్చు. అందుకే, ‘తూచ్.. టీడీపీతో సంబంధాల్లేవ్..’ అని తెలంగాణ బీజేపీ నేతతో బీజేపీ అధిష్టానమే ఖండన ప్రకటన ఇచ్చి వుండొచ్చు.