“అమ్మ ఒడి” చాలా మంచి పథకం అంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ నవరత్న పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ కష్టాల్లో కూడా వీటి అమలు విషయంలో జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తనను పదికాలాలు గుర్తుంచుకునే స్థాయి పథకాలు ఈ నవర్త్నాలు అని బలంగా నమ్ముతున్న జగన్.. వాటి అమలు విషయంలో ఎన్ని ఇబ్బందులొచ్చినా తగ్గేదేలే అంటున్నారు. ఇందులో ముఖ్యంగా “జగనన్న అమ్మ ఒడి” పథకంపై జగన్ అత్యంత శ్రద్ధ పెడుతున్నా పరిష్తితి. ఈ సమయంలో ఈ పథకంపై ప్రశంసల వర్షాలు కురిపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే!

అవును… ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న బాలబాలికలకు 13 వేల రూపాయలంజు ను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోన్న “అమ్మ ఒడి” పథకంపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశంసలు కురిపించారు. పాలకొల్లులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యపై ప్రభుత్వం ఖర్చు చేయడం మంచిదేనని.. అందులో భాగంగా “అమ్మ ఒడి” చాలా మంచి పథకమని వ్యాఖ్యానించారు. పాలకొల్లులో ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెట్ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రామానాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు!

ఈ సందర్భంగా ఈ పథకం గురించి మరింత మాట్లాడిన రామానాయుడు… అమ్మఒడి చాలామంచి పథకం అని.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ మొత్తాన్ని మంజూరు చేయడం మంచి నిర్ణయం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరిలో అమ్మ ఒడి డబ్బులను ఇస్తుండటంతో వాటిని ప్రజలు పండుగకు ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించిన రామానాయుడు… ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరం ప్రారంభంలో నిధులు విడుదల చేయడం మంచి ఆలోచన అని తెలియజేశారు.

ఇదే క్రమంలో… ఈ పథకం విషయంలో ప్రభుత్వానికి ఒక సూచన కూడా చేశారు రామానాయుడు. అమ్మ ఒడి కింద విడుదల చేస్తోన్న మొత్తాలను విద్యార్థుల ఖాతాల నుంచి నేరుగా పాఠశాలలకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పాలకొల్లు ఎమ్మెల్యే సూచించారు. దీనివల్ల విద్యా సంస్థలకు కూడా న్యాయం జరుగుతుందని.. తద్వారా విద్యాసంస్థల యాజమాన్యంపై మరింత బాధ్యత పెరుగుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు!

జగన్ ప్రభుత్వ పథకాలను ఈ స్థాయిలో ప్రశంసించిన వ్యాఖ్యలు ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ వీడియోలను వైసీపీ క్యాడర్ వైరల్ చేస్తాదనడంలో సందేహం లేదు! మరి రామానాయుడి వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి!