ఏపీ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా జరిగాయి. అధికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. మామూలుగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల్లో ఎంత రగడ జరిగినా కాస్త మౌనంగానే ఉంటారు. తక్కువగా, సూటిగా మాట్లాడుతుంటారు. కానీ ఈ సమావేశాల్లో మాత్రం సీఎం వైఎస్ జగన్ సైతం తోటి ఎమ్మెల్యేల తరహాలో ప్రతిపక్షం మీద ధ్వజమెత్తారు. దీంతో సమావేశాలు వాడివేడిగా మారాయి. ప్రతిపక్షం తరపున చంద్రబాబు కూడ గతంలో కంటే గట్టిగానే పోరాడుతున్నారు. ఇక ఈ సమావేశాల్లో అందరికంటే బాగా హైలెట్ అయింది మాత్రం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఈ సమావేశాలతో ఆయన పేరు మీడియాలో, వైసీపీ నేతల్లో బాగా నానింది. ఒక్కసారిగా అందరి దృష్టిలోనూ పడ్డారాయన.
2014లో పాలకొల్లు నుండి గెలిచిన ఈయన 2019లో కూడ గెలుపొందారు. జగన్ హవాలో కూడ విజయం సాధించడంతో అందరి దృష్టీ ఆయన మీద పడింది. అయితే ఎన్నికల తర్వాత ఎన్ని సంచలన విషయాలు జరిగినా పెద్దగా ఎక్కడ మాట్లాడని ఆయన ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం గట్టిగా ఫైట్ చేస్తున్నారు. చంద్రబాబుకు చేదోడు వాదోడుగా నిలబడ్డారు. అధికార పక్షం మీద వీర లెవల్లో ఫైట్ చేశారు. ఎంతలా అంటే ఏకంగా ముఖ్యమంత్రికే కోపం వచ్చేంత. రామానాయుడు మాట్లాడిన మాటలకు జగన్ కోపోద్రిక్తుడైపోయారు. రామానాయుడుకు టార్గెట్ చేసి పెద్ద పెద్ద వ్యాఖ్యలే చేశారు. పింఛన్లు గురించిన చర్చ రాగానే రామానాయుడు మైక్ అందుకుని చంద్రబాబు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పింఛను రూ.75 ఉండేది, వైఎస్ దాన్ని రూ.200 చేశారు. చంద్రబాబు మళ్లీ పింఛను ఐదురెట్లు పెంచి 200 నుండి ఒకేసారి వెయ్యి చేశారు. తర్వాత రెండు వేలు చేశారు. ఇప్పుడు జగన్ రూ.250 మాత్రమే పెంచారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పి దాన్ని వైఎస్సార్ చేయూత కిందకు మార్చి ఏడాదికి రూ.18 వేలే ఇస్తున్నారు. దాని వలన లబ్ధిదారులు 17,500 నష్టపోతున్నారు అన్నారు. దీంతో ముఖ్యమంత్రి చిర్రెత్తుకొచ్చి ఇలా అబద్దాలాడటం సరికాదని నెలకు 1500 కోట్లు పింఛన్లకు ఖర్చు పెడుతున్నామని అంటూ ఇకపై ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్‌ను కోరారు. అంతేకాదు అప్పటికప్పుడు ఆయన మీద సభా హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. ఈ ఇక వైసీపీ ఎమ్మెల్యేలైతే రామానాయుడికి డ్రామానాయుడని పేరుపెట్టి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ రకంగా సీఎం సహా అధికార పార్టీలోని ఎమ్మెల్యేలంతా టార్గెట్ చేయడంతో రామానాయుడు ఒక్కసారిగా హీరో అయిపోయారు. బయటికొచ్చి మళ్ళీ అధికార పార్టీ మీద నిప్పులు చెరిగారు.