ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది .ఇక ఈ నేపధ్యంలో నిన్న వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సి ఎస్ ఆదిత్యనాథ్ దాస్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలను రీషెడ్యూల్ చేస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీలు కూడా పాల్గొననున్నారు.
కాన్ఫరెన్స్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. పంచాయతీల్లో నామినేషన్లకు ఏర్పాట్లు, ఓటర్ల జాబితా రూపకల్పన తదితర అంశాలపై నిమ్మగడ్డ చర్చించనున్నారు. పంచాయతీల్లో భద్రతా పరమైన అంశాలపై సమావేశంలో ఎస్‌ఈసీ చర్చించనున్నారు. అయితే ఎన్నికలు సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.