రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిర్ణయాల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నికలను మధ్యలోనే నిలిపివేయడంతో నిమ్మగడ్డ మీద ప్రభుత్వం వేటు వేసింది. ఆయన పదవీ కాలాన్ని కుదించి వేరొకరిని ఈసీగా నియమించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయి నిమ్మగడ్డ ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. తర్వాత ఎలాగో నిమ్మగడ్డ మళ్ళీ పదవిలోకి వచ్చారు. అయినా ఆయన తీరు ఏకపక్షంగానే ఉండటంతో వైసీపీ నేతలు తమ వాదనను మారినట్టు బలపరుస్తున్నారు.
తాజాగా రమేశ్ కుమార్ మరోసారి ప్రభుత్వ నిర్ణయాన్ని లెక్కచేయకుండా నోటిఫికేషన్ ఇచ్చేయడం సర్వత్రా సంచలనం రేపింది. వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ కేవలం చంద్రబబు నాయుడుకు మేలు చేయడం కోసమే నిమ్మగడ్డ ఎన్నికలు పెడుతున్నారని ఆరోపిస్తూ గత విషయాలను ఆసక్తికర రీతిలో బయటపెట్టారు. అసలు నిమ్మగడ్డ 2018 ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించిన అంబటి చంద్రబాబు నాయుడు ఓడిపోతారనే పెట్టలేదని రాష్ట్రంలో కేవలం 30 కోవిడ్ కేసులు ఉండగా రాత్రిలో రాత్రి ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలను నిలిపివేశారని, అప్పుడు కూడ టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు కుట్ర చేశారని అన్నారు.
ఇప్పుడు కూడ కేవలం ప్రతిపక్షానికి మేలు చేయడం కోసమే ఎన్నిక్లను నిర్వహించడానికి రెడీ అయ్యారని, రాష్ట్రంలో ట్రయల్ రన్ పెడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పాలని, ప్రభుత్వం ట్రయల్ రన్ పనుల్లో ఉండగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటుంది. అప్పుడు ఎన్నికలు పెట్టడం అంటే సాధ్యంకాని పని, మరి అప్పుడే ఎన్నికలు పెట్టాలని ఈసీ పట్టుబట్టడం ఎంతవరకు సమంజసం. తనను ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకోవడానికే చంద్రబాబు ఈ వ్యవహారం నడుపుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ కంటే పెద్ద స్థాయిలో ఉన్న చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దంటున్నా, ఎన్నికలు పెడతానని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పడం చూస్తుంటే ఇది ప్రజల ప్రాణాల మీద కుట్రగా భావించాల్సి వస్తోందన్నారు.