జగన్ సర్కార్ పై కోర్టు ధిక్కరణ కేసు వేసిన నిమ్మగడ్డ

Big Twist: High Court breaks SEC lemongrass speed

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎంత దూకుడుగా ప్రవర్తిస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అప్పటి సీఎస్ నీలం సాహ్నిల పేర్లను తన పిటిషన్ లో ప్రధానంగా చెప్పారు.

ఈ పిటిషన్ కు సంబంధించి ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను ప్రతివాదిగా చేసేందుకు హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు వాదనలు విన్న పిమ్మట తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ భారీ నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఎస్ఈసీకి తెలియకుండా ప్రకటనలు ఎలా ఇస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ ప్రకటనలు ఇచ్చిన అధికారులను వివరణ కోరామని కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవాల కోసం రాష్ట్ర గవర్నర్ ను పలు పార్టీల నేతలు కలిశారని నిమ్మగడ్డ చెప్పారు. ఏకగ్రీవాలు మంచిదేనని అయితే అవి సామరస్యపూర్వకంగా ఉండాలని అన్నారు. భయపెట్టి, బలవంతం చేసి ఏకగ్రీవాలు చేయడం సరికాదని చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం సాధించడమని అన్నారు. ఎన్నికల్లో జోక్యం చేసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై నిఘా పెట్టాలని చెప్పారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసే వారిని హౌస్ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఫిబ్రవరి 1,2 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అనంతపురం, కర్నూల్‌ జిల్లాల్లో శుక్రవారం నాడు పర్యటించిన ఆయన.. శనివారం నాడు కడప జిల్లాలో పర్యటిస్తారు. ఫిబ్రవరి 1న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్న నిమ్మగడ్డ.. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తారు.