రాజమండ్రిలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. 2020 సంవత్సరం మొత్తం ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ దొరికిందని సంతోషపడేలోపే కొత్త రకం కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొత్తరకం కరోనావైరస్ కలకలం రేగింది. రాజమహేంద్రవరంలో ప్రజలు ఇప్పుడు కొత్త కరోనా వైరస్ టెన్షన్ లో ఉన్నారు.

Is Rajahmundry a good place to live? - Quora

రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట సమీపంలోని రామకృష్ణ నగర్ కు చెందిన ఒక ఆంగ్లో-ఇండియన్ ఇటీవల యూకే నుండి ఇండియాకు వచ్చారు. ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇప్పుడు అందరిలో కొత్త రకం కరోనా వైరస్ పై ఆందోళన నెలకొంది.ఆమె ఢిల్లీలో హోం క్వారంటైన్ ఉండకుండా తప్పించుకుని రావటంతో ఇప్పుడు ఆమె కోసం అన్వేషణ మొదలైంది .

ఈనెల 22వ తేదీన యూకే నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చిన ఆమెను, ఆమె కుమారుడు ఢిల్లీ వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. ఆమె యుకెలో కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఫలితాలు రాకముందే భారత్ బయలుదేరి వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వచ్చే వరకు ఆమె క్వారంటైన్ లో ఉండాల్సి ఉండగా అక్కడి నుంచి పరారైన సదరు మహిళ రాజమహేంద్రవరం రావడానికి ఢిల్లీ నిజాముద్దీన్ ట్రైన్ ఎక్కి నట్లుగా గుర్తించారు. ఇక ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్న అధికారులు ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించారు.

ఆమె పాస్ పోర్ట్ ఆధారంగా అడ్రస్ ను గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తం చేయడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమెను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలిసిన తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డులో ఆమెకు చికిత్స అందించాలని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇప్పుడు రాజమండ్రిలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేగింది. ఆ మహిళ ఎక్కడ ఎవరికీ ఈ కొత్త కరోనా వైరస్ వ్యాపింపజేస్తుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తమౌతుంది.