మహానాడు సందర్భంగా ఇచ్చిన నాలుగు రోజుల విరామం తర్వాత.. పాదయాత్రకు రెడీ అయ్యారు నారా లోకేశ్. పాదయాత్ర విడిది కేంద్రానికి ఆయన సోమవారం సాయంత్రానికి చేరుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేశ్.. ఈ నెల 23న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రవేశించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈ నెల 24, 25 తేదీల్లో రెండురోజుల పాటు పాదయాత్ర చేశారు.
అనంతరం రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కోసం నాలుగు రోజులు విరామం ఇచ్చారు. మహానాడు వేడుకను పూర్తి చేసుకుని తిరిగి సోమవారం కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రానికి చేరుకున్నారు.
అయితే పాదయాత్ర విషయంలో ఇంతకాలం ఒకలెక్క, ఇకనుంచి ఒకలెక్క అనేస్థాయిలో ఆలోచనలో ఉన్నారంట టీడీపీ కేడరు! కారణం… మహానాడులో లోకేష్ ఒక దెబ్బ కొట్టారు! అవసరం తీరిపోయాక ఈయన కూడా లైట్ తీసుకుంటారనే మచ్చ అప్పుడే తెచ్చేసుకున్నారు. కారణం… ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.
అవును… తన పాదయాత్రలో భాగంగా నగిరిలో గాలి భానుప్రకాష్ నాయుడు, శ్రీకాళహిస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, చంద్రగిరిలో పులివర్తి నాని, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ లాంటి కొందరిని అభ్యర్థులుగా ప్రకటించారు లోకేష్. రాబోయే ఎన్నికల్లో వీళ్ళందరికీ ఓట్లేసే గెలిపించాలని జనాలను కోరారు. దీంతో తమను అభ్యర్థులుగా అందరిముందు ప్రకటించారో అప్పటి నుండి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బాగా ఖర్చు పెట్టుకుంటున్నారు సదరు నేతలు.
అయితే తాజాగా మహానాడు వేదికపై మైకందుకున్న చినబాబు… తాను ప్రకటించిన వాళ్ళెవరు అభ్యర్థులు కారని, అభ్యర్థులను ఫైనల్ చేసేది, ప్రకటించేది అంతా అధినేత చంద్రబాబునాయుడే అని తేల్చేశారు. దీంతో నియోజకవర్గాల్లో తమ మద్దతుదారులకు ఏమని సమాధానం చెప్పుకోవాలి, జనాలను ఓట్లు ఎలా అగడగాలి అని చికాకు పడుతున్నారంట పైన పేర్కొన్న అభ్యర్థులు. అయితే “చినబాబు పాదయాత్రలో మనం ఎంత ఉద్ధరించినా… ఎంత ఉత్సాహం చూపించినా… వేస్ట్ అన్నమాట… ఏదైనా పెద్దాయన దగ్గర తేల్చుకోవడమేనన్న మాట” అని అంటున్నారంట మిగిలిన నియోజకవర్గంలోని ఆశావహులు.
మరి పరిస్థితి ఇలా ఉండటం.. టిక్కెట్ల విషయంలో లోకేష్ కు అంత ఛాన్స్ లేదని తెలియడంతో… పాదయాత్రలో మిగిలిన నియోజకవర్గాల్లో టిక్కెట్టు ఆశిస్తున్న నేతలు ఏ మేరకు సపోర్ట్ చేస్తారనేది వేచి చూడాలి!