ఒకపక్క రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే “శ్రీమతి ఎన్టీఆర్” ముఖ్య అతిధిగా విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా మైకందుకున్న రాం గోపాల్ వర్మ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి!
విజయవాడలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ… వేదికపై ఉన్నవారిని నమస్కారం పెట్టడానికో, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొనడానికి తాను విజయవాడకు రాలేదని.. ఒక జోక్ చెప్పడానికి వచ్చానని.. ఆ జోక్ విన్నతర్వాత నవ్వాలో ఏడవాలో మీ ఇష్టం అని సభికులను ఉద్దేశించి అన్నారు. అది ఎంత పెద్ద జోక్ అంటే.. స్వర్గంలో ఉన్న రామారావు సైతం నవ్వాలో, ఏడ్వాలో తెలియని జోక్ అని వ్యంగ్యంగా అన్నారు. ఫైనల్ గా కంక్లూజన్ ఇస్తూ… ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతుందని వర్మ క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పక్కన కూర్చుని.. ఆయన గురించి మరో సూపర్ స్టార్ రజనీకాంత్ పొగడటం అంటే ఆయన కూడా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్లే అని ఆర్జీవీ సంచలన కామెంట్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆ మహానుభావుడికి చివరిదశలో సేవలు చేసిన లక్ష్మీపార్వతి లేరని ఆర్జీవీ గుర్తుచేశారు.
ఈ సమయంలో హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ హాజరుకాకపోవడంపై వర్మ సంచలన క్లారిటీ ఇచ్చారు. నందమూరి తారకరామారావు ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని వర్మ కితాబిచ్చారు. ఎందుకంటే అంత పెద్ద సూపర్ స్టార్ కొడుకులు ఎవరూ తీసుకోని విధంగా తారక్ ఒక్కడే స్టాండ్ తీసుకున్నారని చెప్పారు. తారక్ ఒక్కడే తాతమీదున్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదనేది తన అభిప్రాయంగా ఆయన చెప్పారు. అందుకు తారక్ కు తాను ఎన్టీఆర్ అభిమానిగా థ్యాంక్స్ చెబుతున్నానన్నారు.
ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు ఆన్ లైన్ వేదికగా వైరల్ గా మారాయి. హైదరాబాద్ లో జరిగిన వేడుకలకు జూనియర్ హాజరుకాకపోవడంపై ఉత్సవ కమిటి చైర్మన్ టిడి జనార్దన్ చేసిన కామెంట్లపై ఇప్పటికే గుర్రుగా ఉన్న జూనియర్ అభిమానుల తరుపున… వర్మ క్లారిటీ ఇచ్చినట్లయ్యిందనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి!