మహానాడుతో రాజమహేంద్రవరం పసుపుమయమైంది. టీడీపీ నేతలు, తెలుగు తమ్ముళ్లతో మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. సాధారణ కార్యకర్తల నుంచి నేతల వరకూ అందరిలో మహానాడు జోష్ కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి కావడం, ఎన్టీఆర్ శతజయంతి కూడా రావడంతో ఈసారి మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. ఇదిలా ఉంటే ఈ మహానాడులో లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహానాడు ప్రాంగణానికి నారా లోకేష్ చేరుకోగానే కార్యకర్తలు, అభిమానులు కేరింతలతో హోరెత్తించారు. లోకేష్ రాకతో మహానాడు ప్రాంతమంతా సందడి సందడిగా మారిపోయింది. పార్టీ ప్రతినిధులకు అభివాదం చేసుకుంటూ.. అందర్నీ పలకరించుకుంటూ లోకేష్ స్టేజీపైకి చేరుకున్నారు. కాబోయే సీఎం లోకేష్ అంటూ కొంతమంది నినాదాలు చేయగా… వారిని వేంటనే వారించి సైలంట్ చేశారు! ఈ సందర్భంగా “జనహృదయమై నారా లోకేష్” పుస్తకం హాట్ టాపిక్ గా మారింది.
“జనహృదయమై నారా లోకేష్” అంటూ యువగళం పాదయాత్రపై కేశినేని చిన్ని ముద్రించిన పుస్తకంపై పార్టీ కార్యకర్తల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. లోకేష్ పాదయాత్ర, పార్టీలో వచ్చిన మార్పు, కేడర్ లో వచ్చిన కథలికలతో కేసినేని చిన్ని ఒక పుస్తకం ముద్రించారు. లోకేష్ పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక సంచికను విడుదల చేశారు.
అయితే ఇది కాస్త తొందరపాటు చర్య అని… ఒక షెడ్యూల్ పూర్తి అవ్వగానే సినిమా రివ్యూ ఇచ్చినట్లు ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇలా లోకేష్ పాదయాత్రపై పుస్తకం రిలీజ్ చేయాలనే ఆలోచన మంచిదే కానీ… పాదయాత్ర పూర్తయ్యే వరకూ ఆగాల్సిందని కొంతమంది తమ్ముళ్లు చెవులు గొణుక్కుంటున్నారు.