175కి 175 సీట్లలో ఎందుకు గెలవలేం.. అత్యాశకు కూడా హద్దుండాలిగా జగన్?

2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 151 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఈ స్థాయిలో వైసీపీ అసెంబ్లీ సీట్లను సాధిస్తుందని ఎవరూ అంచనా వేయలేదు. అయితే పరిస్థితులన్నీ అనుకూలించడంతో పాటు జగన్ ఇచ్చిన హామీలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఉండటంతో ఆ స్థాయిలో అసెంబ్లీ సీట్లు సాధ్యమయ్యాయి. 2014 ఎన్నికల్లో మాత్రం వైసీపీ కేవలం 67 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించింది.

అయితే 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీ 175 స్థానాలలో విజయం సాధించి చరిత్ర సృష్టించాలని జగన్ భావిస్తున్నారు. జగన్ ఆశించినా ఈ స్థాయిలో సంచలనాలు సృష్టించడం ఏ పార్టీకి అయినా సులువు కాదనే సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వర్క్ షాప్ లో మాట్లాడుతూ నేను చేయాల్సినది చేస్తున్నానని మీరు కూడా కష్టపడాలని సూచనలు చేశారు.

నాణ్యత అనేది చాలా ముఖ్యమని నాణ్యతతో చేస్తే పది కాలాల పాటు చిరస్థాయిలో నిలిచిపోయే అవకాశం అయితే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రీజన్ వల్లే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలోని 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించామని చెప్పిన జగన్ 175 స్థానాలకు 175 స్థానాలలో ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు.

గ్రామ సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు 20 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామని జగన్ తెలిపారు. అయితే ప్రజల కోసం ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేసినా 175 స్థానాలలో గెలవాలని అనుకుంటే అత్యాశ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పని చేసే ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్లను కేటాయిస్తానని సీఎం జగన్ చెప్పడం కొసమెరుపు. చాలామంది ఎమ్మెల్యేలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం.