నేషనల్ మీడియాకి చెందిన రిపబ్లిక్ టీవీ, ఆంధ్రపదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వంపై సంచలన కథనాల్ని ప్రసారం చేస్తోంది. మొన్నటికి మొన్న జగన్ బినామీల వ్యవహారంపై కొందరు విదేశీయులు, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారనీ, త్వరలోనే ‘పుట్ట బద్దలు కాబోతోంది’ అనీ రిపబ్లిక్ కథనాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గత విభేదాలంటూ ఇంకో కథనాన్ని వండి వడ్డించింది. నిజానికి, మీడియా సంస్థలు ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రయత్నాలు చేయడం సర్వసాధారణమైపోయింది. చంద్రబాబు హయాంలో టీడీపీ మీద జగన్ అనుకూల మీడియాలో ఇంతకు మించిన కథనాలొచ్చాయి. ‘తన దాకా వస్తేగానీ తలనొప్పి సంగతేంటో తెలియదు’ అన్నట్టు, వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఉలిక్కిపడింది రిపబ్లిక్ టీవీ కథనంతో. రిపబ్లిక్ అధినేత ఆర్నబ్ గోస్వామిపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టపరమైన చర్యల విషయమై పరిశీలిస్తున్నాం.. అని సజ్జల వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, రెండున్నరేళ్ళ తర్వాత తన మంత్రివర్గంలో 80 శాతం మందికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.రెండేళ్ళు పూర్తయిపోతోంది.
ఈ నేపథ్యంలో పదవులు కోల్పోయేవారిలో ఖచ్చితంగా అసహనం, ఆందోళన పెరుగుతుంటాయి. అలాంటోళ్ళే ముందస్తుగా మీడియాకి లీకులు పంపుతుంటారు. ఈ విషయం సజ్జలకి తెలియదని ఎలా అనుకోగలం.? ఆ సంగతి పక్కన పెడితే, రిపబ్లిక్ టీవీ అనేది బీజేపీ కనుసన్నల్లో నడుస్తోన్న న్యూస్ ఛానల్. అందులో ఇలాంటి కథనాలు రావడమంటే, అది బీజేపీ పనే. కానీ, చిత్రంగా సజ్జల.. బీజేపీని ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు. ఇది చంద్రబాబు కుట్ర.. అని తేల్చేశారు సజ్జల. జగన్ బినామీలపై కేంద్రానికి విదేశీయుల ఫిర్యాదు కథనం వచ్చిన వెంటనే, ‘జగన్ సర్కారుని అదుపులో పెట్టేది మోడీ ప్రభుత్వమే..’ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సెలవిచ్చిన విషయాన్ని సజ్జల మర్చిపోతే ఎలా.? బీజేపీ నుంచి పొంచి వున్న ప్రమాదాన్ని విస్మరిస్తే.. వైసీపీకి కనీ వినీ ఎరుగని రీతిలో నష్టం జరుగుతుందన్నది వైసీపీ అధినాయకత్వం ఎప్పుడు గుర్తిస్తుందో ఏమో.