నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంమయ్యాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. దీంతో పాటు మరిముఖ్యంగా విశాఖకు రాజధాని తరలించే విషయం.. కనీసం సీఎం జగన్ విశాఖకు తరలి వెళ్ళే విషయం… ఇలా మొదలైన కీలక విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అలాంటి ఈ కీలక సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ దూరంగా ఉండనున్నారు.
తన భార్యను వైకాపా నాయకులు అవమాన పరిచారని ఎక్కి ఎక్కి దుఖపడిన టీడీపీ అధినేత చంద్రబాబు… “ముఖ్యమంత్రి అయ్యాకే సభకు వస్తాను” అని ప్రతిన భూని అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. “ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ… ఇంట్లో రెస్ట్ తీసుకుంటాను – సీఎం అయితేనే అసెంబ్లీకి వస్తాను – తనను ఓడించినందుకు ప్రజా సమస్యలపై చర్చించకుండా వెళ్లిపోతాను – జనాలపై ఇది తన మార్కు రివేంజ్” అన్నట్లుగా బాబు సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. పోనీ మండలిలో చినబాబు దర్శనం అయినా ఉంటుందా అంటే.. అది కూడా ఉండదని అంటున్నారు తమ్ముళ్లు!
ఈ నెల 27తో లోకేష్ ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. అంటే… ప్రస్తుతానికి లోకేష్ కు ఇవే చివరి సమావేశాలు. అయినా కూడా ఈ సమావేశాలకు చినబాబు హాజరుకావడం లేదు. పాదయాత్ర పేరు చెప్పి ఆయన హాజరయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. తారకరత్న మరణానంతరం – శివరాత్రి పర్వదినం – కడుపులో నలతగా ఉండటం – ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటం… ఇలా రకరకాల కారణాలతో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన చినబాబు…. ప్రజా సమస్యలపై చర్చించే శాసనమండలి సమావేశాలకు మాత్రం గైర్హాజరవుతున్నారు. కనీసం పండగలకి ఇచ్చిన ప్రాముఖ్యత కూడా ప్రజా సమస్యలపై చర్చించడానికి ఇవ్వలేకపోతున్నారు.
అయితే అత్యంత కీలకమైన ఈ సమావేశాల్లోనే సీఎం జగన్ విశాఖకు తరలి వెళ్లనుండటంపైనా స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇలాంటి కీలక సమావేశాలకు తండ్రి కొడుకులిద్దరు దూరంగా ఉండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
ఇక సమావేశాల విషయానికొస్తే… సమావేశాల తొలిరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. అనంతరం ఉభయసభలూ మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. ఆ వెంటనే శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్లు భేటీ అయి సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నాయి.
ఇదిలా ఉంటే… కనీసం 7 లేదా 8 రోజులపాటు అంటే… ఈ నెల 14 నుంచి 24 వరకు సఈ మావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.