ప్రాథమిక సూత్రానికి విరుద్ధం… అన్నదమ్ములిద్దరి ఆలోచనా ఒకటే?

ఇంతజరిగాక కూడా మారకపోతే ఎలా… ఒకరిది సినిమాలు చేసిన అనుభవం, మరొకరిది సినిమాలు చూసిన అనుభవం! అంతమాత్రాన్న ఇంత జరిగినా కూడా ఇంకా సినిమా డైలాగులు చెబుతూ… తమను తాము ఎక్కువ ఊహించుకుంటూ రాజకీయాలు చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి? ఎవరికి ఉపయోగం? ఎంత ఉపయోగం అనే చర్చ మొదలైంది.

అవును… అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ యువకిశోరం నారా లోకేష్ ల పరిస్థితి చూసిన అనంతరం పైన చెప్పిన ప్రశ్నలు, కామెంట్లే వినిపిస్తున్నాయి. చంద్రబాబు లోపలికి వెళ్లే ముందు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన స్టేట్ మెంట్లు, చేసిన ఛాలెంజ్ ల సంగతి తెలిసిందే. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని చెప్పేవారు చంద్రబాబు.

అయినా చట్టం తనపని తాను చేసుకుపోయిందని చెబుతున్నారు వైసీపీ నేతలు. కట్ చేస్తే సుమారు నెల రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇంటినుంచి వచ్చే భోజనం, మందులు వేసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నారని అంటున్నారు. మరోపక్క ఈ సమయంలో పార్టీని కాపాడుకోవాల్సిన లోకేష్, ఆయనకు సపోర్ట్ గా ఉండాల్సిన పవన్ లు మాత్రం సినిమా డైలాగులు మానడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయిన చంద్రబాబు సుమారు నెల రోజులుగా రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్నారు. ఈ సమయంలో వీళ్ళిద్దరు సమన్వయంతో ముందుకు సాగాల్సింది పోయి… హస్తినలో ఒకరు, కృష్ణాజిల్లాలో మరొకరు తమ తమ్మ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్… కృష్ణాజిల్లాలో వారాహి యాత్ర మొదలుపెట్టారు. ఇక్కడ విషయం ఏమిటంటే పవన్ అయినా లోకేష్ అయినా పదేపదే సీఎం జగన్ పై వార్నింగ్‌ లు మీద వార్నింగులిస్తున్నారు. ఈ ఇద్దరు ఎక్కడ మాట్లాడినా… తామంటే జగన్ భయపడుతున్నారని చెబుతున్నారు. జగన్ కు భయం పరిచయం చేస్తామని పలుకుతున్నారు. అయితే… అసలు వీళ్ల‌ను చూసి జగన్ ఎందుకు భయపడాలో అర్ధం కావడంలేదనే మాటలు వినిపిస్తున్నాయి.

గడిచిన ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ అధినేత కొడుకు హోదాలో పోటీ చేసిన లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. మరోపక్క జనసేన అధినేత హోదాలో రంగంలోకి దిగిన పవన్.. భీమవరం, గాజువాకలో ఒడిపోయారు. ఇద్దరికీ కామన్ పాయింట్ ఏమిటంటే… జగన్ అంటే నిలువెత్తు ధ్వేషం తప్ప మరొకటి కాదు. దానివల్ల ఎన్నికల్లో ప్రయోజనం కలగలేదనే విషయం 2019లో ఒకసారి చూసేశారు కూడా!

అసలు 151 సీట్ల విజయంతో ముఖ్యమంత్రి అయిన‌ జగన్ వీళ్ళిద్దరిని చూసి భయపడటం ఏమిటనేది సామాన్యులకు అర్ధం కాని విషయం. ఇక్కడ సమస్య ఏమిటంటే వీళ్ళిద్దరు తమను తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారు. ఇదే సమయంలో వైఎస్ జగన్‌ ను చాలా తక్కువగా చూస్తున్నారు. రాజకీయాల్లో అయినా ఏ రంగంలో అయినా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు అనేది ప్రాథమిక సూత్రం.

ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది ఓటమికి ప్రారంభ మెట్టు అని అంటారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఓవర్ కాన్పిడెన్స్ వల్లే 2019 ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణమైందనేది పరిశీలకుల మాట. మరోపక్క అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నప్పటికీ… జగన్ మాత్రం బీరాలకు పోకుండా సైలంట్ గా తమపని తాను చాపకింద నీరులా చేసుకుపోతున్నారు.

అయినప్పటికీ వీరి వైఖరిలో మార్పు రావడం లేదు. అయితే జైల్లో ఉన్న చంద్రబాబుకు బయట వీరు అనుసరిస్తున్న వైఖరే ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. వీరిద్దరూ యువకులు, కొద్దో గొప్పో యూత్ ఫాలోయింగ్ ఉన్న నేతలు… ఆ అవకాశాన్ని సక్రమంగా వినియోగించకుండా… జగన్ ని తిట్టడం వల్ల వచ్చే ఈలలకు బానిసలవడం ఏమిటనేది ఇప్పుడు బాబుకి ఉన్న పెద్ద బెంగ అని అంటున్నారు.

మరి ఇప్పటికైనా వీరి తీరు మారుతుందా.. లేక, ఇలానే జగన్ కి తామంటే భయం అని చెప్పుకుంటూ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఇలానే కంటిన్యూ అయిపోతారా అనేది ఆసక్తిగా మారింది.