మంత్రులకు క్లాసు పీకిన చంద్రబాబు

అవును ఎన్నికల ముందు జరిగిన చివరి క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరికీ చంద్రబాబునాయుడు ఫుల్లుగా క్లాస్ పీకారట. జగన్మోహన్ రెడ్డిపై పోరాటంలో తాను తప్ప మంత్రులెవరూ పెద్దగా ఆసక్తి చూపటం లేదనేది చంద్రబాబు బాధ. ఏ విషయంలో అయినా జగన్ ను తానొక్కడినే విమర్శిస్తున్నానంటూ చంద్రబాబు అందరిపైనా మండిపడ్డారు. తనపై జగన్, వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సరైన సమాధానం ఇవ్వకపోతే దాన్నే జనాలు నిజమనుకునే ప్రమాధముందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారట.

పైగా జగన్, కెసియార్,  నరేంద్రమోడి ఒకటేనని, ఏపిపై కెసియార్ విషం చిమ్ముతున్నారనే ప్రచారాన్ని బాగా ఎక్కువగా ప్రజల్లోకి వ్యాప్తి చేయాలట. అవసరానికి మించి జగన్ పై విషప్రచారం చేయాలన్నట్లుగా చంద్రబాబు మంత్రులకు ఆదేశాలిచ్చారు. జగన్ నేరస్తుడని, అవినీతిపరుడని, కెసియార్ తో జతకట్టి ఏపికి అన్యాయం చేస్తున్నాడన్న విషయాన్ని జనాల్లోకి బాగా తీసుకెళితేనే మనకు ఉపయోగం ఉంటుందని చంద్రబాబు నెత్తీ నోరు మొత్తుకున్నారు.

అయినా జగన్ పై ఇప్పటికే చంద్రబాబు, మంత్రులు, నేతలు చల్లని బురద లేదు, చల్లని రోజు లేదు. రాష్ట్రంలో ఎక్కడ చంద్రబాబుకు ఇబ్బంది జరిగే ఘటన జరిగినా వెంటనే జగన్ కు ముడిపెట్టేసి కెసియార్, మోడిని పిక్చర్లోకి లాగేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. స్కూల్ పిల్లలకు టైం టేబుల్ పెట్టినట్లుగా మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలకు టైం టేబుల్ ఫిక్స్ చేసి ప్రతీరోజు జగన్ ను తిట్టిస్తునే ఉన్నారు. మంత్రులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయడు, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కెఎస్ జవహర్, దేవినేని ఉమ ప్రతీరోజు జగన్ ను తిడుతునే ఉన్నారు.