అవును చంద్రబాబునాయుడు అదే మాటన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్నపుడు అడ్డు తగిలిన బాధితులపై నోరు పారేసుకున్నారు. తన మాటకు అడ్డువచ్చినా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా బుల్డోజర్లతో తొక్కించేస్తానంటూ వార్నింగ్ ఇవ్వటం ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది. తోకలు కత్తిరించేస్తానని, తోలు తీసేస్తాననే మాటలు మామూలే అనుకోండి అది వేరే సంగతి. ఇంతకీ విషయం ఏమిటంటే, తిత్లీ తుపాను తీవ్రతకు శ్రీకాకులం జిల్లా దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే.
సహాయ పునరావాస చర్యలను స్పీడుగా చేయించటం కోసం చంద్రబాబు రెగ్యులర్ గా జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న పనిని అభినందించాల్సిందే. అయితే, సహాయం అందనివాళ్ళు, ఇంకా బాధలు పడుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం సహాయ పునరావాస పనులను వేగంగా పూర్తి చేసేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేస్తోంది. సహాయ చర్యలను ఇంత వేగంగా చేస్తున్న ప్రభుత్వం మరోటి లేదన్నట్లు ట్విట్టర్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు.
కానీ వాస్తవం ఏమిటంటే తమకు సహాయం అందలేదంటూ చాలా గ్రామాల జనాలు ఎక్కడికక్కడ చంద్రబాబును నిలదీస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలంలోని బైపల్లి, గరుడబద్ర, బూతుపురం, చినవంక, డోకులపాడు, తాడివాడ, కిడిసింగి, వజ్రపుకొత్తూరు గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. బాధితులకు ప్రభుత్వం చేస్తున్న సహాయం గురించి చంద్రబాబు వివరిస్తున్నపుడు బాధితులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. దాంతో చంద్రబాబుకు మండిపోయింది. అంతే గ్రామస్తులపై నోరు పారేసుకున్నారు. తోకలు కత్తిరించేస్తానన్నారు. తోలు తీసేస్తానన్నారు. ఎక్కువ మాట్లాడితే బుల్డోజర్లతో తొక్కించేస్తాననటంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆమధ్య అమరావతి సచివాలయంలో నాయీబ్రాహ్మణులను కూడా ఇదే విధంగా బెదిరించిన విషయం గుర్తుండే ఉంటుంది.