అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళయింది. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా లేవలేదు. అసలు ప్లాన్లే డిసైడ్ కాలేదు. మరో ఆరు మాసాల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఈ దశలో నిర్మాణాలు ప్రారంభించినా పనులు ముందుకు సాగవు. ఎందుకంటే, ప్రతీ పనికి కేంద్రం అనుమతి కావాల్సిందే. కేంద్రం అనుమతులు ఇచ్చే ముచ్చట కనిపించటం లేదు.
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రవుతారో లేదో తెలీదు. ఈ నేపధ్యంలోనే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు కావలంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. రాజధాని అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధమికంగా రూ 1,09,023 కోట్లు కావాలంటు అంచనాలు వేయటంలో అర్ధమేంటి ?
పోయిన ఎన్నికల ప్రచారంలో రాజధాని నిర్మాణం జరగాలంటే తనలాంటి అనుభవజ్ఞుడే కావాలంటూ ఊదరగొట్టిన విషయం అందరూ చూసిందే. జనాలు కూడా నిజమే అనుకుని చంద్రబాబుకు పట్టం కట్టారు. కానీ ముఖ్యమంత్రయిన తర్వాత చంద్రబాబు ఏం చేశారు ? అనుభవం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. రాజధాని నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలు వృధా చేశారు.
డిజైన్లన్నారు, శంకుస్ధాపనలన్నారు. అది కూడా ఒకటికి నలుగురితో పునాదులేయించారు. ప్రతీసారి భారీ ఈవెంట్లు నడిపించారు. దీనికి అదనంగా అత్యుత్తమ డిజైన్లపై అధ్యయనం పేరుతో ఎన్నో విదేశాలు తిరిగారు. తాను తిరగటం కాకుండానే ఎన్నో బృందాలను పంపారు. మొత్తానికి వందలాది కోట్ల రూపాయలు ఖర్చయింది. వందల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఖజానా ఖాళీ అయ్యింది.
రాజధాని నిర్మాణం చంద్రబాబుతో అయ్యేది కాదన్న విషయం జనాలకు బాగా అర్ధమైపోయింది. అందుకనే అమరావతి నిర్మాణాన్ని జనాలు పట్టించుకోవటం మానేశారు. ఎటూ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కాబట్టి టిడిపి నేతలు కూడా అమారవతి నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పైగా రాజధానిలో మౌళికసదుపాయాల కల్పనకు కేంద్రం మంజూరు చేసిన నిధులు మాత్రం ఖర్చయిపోయాయి. ఎలా ఖర్చు చేశారంటే ప్రభుత్వం నుండి సరైన సమాధానం రావటం లేదు. అందుకనే కేంద్రం నిధులను నిలిపేసింది.
తాజాగా అమరావతి నిర్మాణానికి సుమారు రూ 1.10 లక్షల కోట్లు కావాలంటూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందులో రూ 40 వేల కోట్లు కావాలంటూ కేంద్రానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) కూడా పంపారు. కేంద్రానికి ఎందుకు పంపారంటే రాజధాని నిర్మాణానికి సహకరించటం లేదని మళ్ళీ నరేంద్రమోడిని అమ్మనాబూతులు తిట్టటానికి.
రూ 40 వేల కోట్ల అంచనాతో ప్రభుత్వ కాంప్లెక్స్, అసెంబ్లీ, హై కోర్టు, రాజ్ భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల బంగ్లాలు, సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ళ నిర్మాణం లాంటివి నిర్మిస్తారట. పై మొత్తం మూడేళ్ళకు అవసరమట. మొదటి ఏడాదిలో రూ 10, 610 కోట్లు, రెండో సంవత్సరంలో రూ 22,578 కోట్లు, మూడో ఏడాదిలో రూ 6749 కోట్లు అవసరమని డిపిఆర్ లో చెప్పింది. 40 వేల కోట్లను కేంద్రం ఇచ్చేది లేదు చంద్రబాబు నిర్మాణాలు ఆరంభించేది లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే వచ్చే ఎన్నికలు పూర్తయ్యేవరకూ చంద్రబాబు ఏదో ఒక డ్రామా ఆడుతునే ఉంటారంతే.