ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎంఎల్ఏలకు షాక్ ?

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీలోని ఇద్దరు ఎంఎల్ఏలకు చంద్రబాబునాయుడు షాక్ ఇవ్వటం దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. ఇద్దరు ఎంఎల్ఏలకు మళ్ళీ టిక్కెట్లు ఇచ్చేది లేదని ఇప్పటికే చంద్రబాబు వాళ్ళిద్దరికీ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరి పనితీరు ఏమాత్రం బావోలేకపోవటంతో పాటు ఎంపి అభ్యర్ధి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా వారిద్దరిని మార్చాలని పట్టుబడుతున్నారట. నిజానికి ఒంగోలు ఎంపిగా పోటీ చేయటానికి టిడిపిలో గట్టి నేతేలేరు. అందుకనే మాగుంటను పట్టుకుని చంద్రబాబు వేలాడుతున్నారు.

 

ఇదే అదునుగా మాగుంట కూడా తన డిమాండ్ల చిట్టాను విప్పారు. తన మద్దతుదారులకే టిక్కెట్లు ఇచ్చేట్లయితేనే తాను ఎంపిగా పోటీ చేస్తానని పట్టుబట్టారట. దాంతో చేసేదిలేక మాగుంట షరతులకు చంద్రబాబు తలొంచారనే అనుకోవాలి. ఈమధ్యనే చంద్రబాబు రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఎంపి అభ్యర్ధిగా మాగుంటను ప్రకటించారు. అదే సమయంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఎవరిని పోటీ చేయించాలనే విషయంలో మాగుంటకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు కూడా చెప్పారు.

 

దాంతో తన మద్దతుదారులను మాగుంట రెడీ చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలపై మాగుంట ముందుగా దృష్టి పెట్టారు. కనిగిరిలో ప్రస్తుతం కదిరి బాబురావున్నారు. ఆయన నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. ఇక, ఎర్రగొండపాలెం ఎంఎల్ఏ డేవిడ్ రాజు ఫిరాయింపు ఎంఎల్ఏ. వీళ్ళద్దరి స్ధానంలో కొత్తవారిని పోటీ చేయించాలని మాగుంట షరతు పెట్టారు. దానికి చంద్రబాబు కూడా అంగీకరించారని సమాచారం.

 

అంటే, ఇద్దరు ఎంఎల్ఏలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చేసినట్లే. ఇక మార్కాపురం నియోజకవర్గంలో ఇన్చార్జిగా ఉన్న నారాయణరెడ్డిని కూడా మార్చేయాలని మాగుంట చెప్పారు. అందుకనే నారాయణరెడ్డి స్ధానంలో ఉగ్రనరసింహారెడ్డిని త్వరలో నియమించేందుకు రంగం సిద్ధమైంది. ఉగ్రనరసింహారెడ్డి ఎటూ మాగుంటకు బాగా సన్నిహితుడే. కాబట్టి రేపటి ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గంలో ఉగ్రనే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, పై ఇద్దరు ఎంఎల్ఏల  ప్లేస్ లో ఎవరిని పోటీ చేయించేది మాత్రం సస్పెన్సుగా మిగిలిపోయింది. కనిగిరిలో ఓ రెడ్డిని, ఎర్రగొండపాలెంలో యరిక్షన్ బాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరి ఏమవుతుందో చూడాలి.