తల్లీ కూతుళ్ళకు ఒకేసారి షాక్ ?

అనంతపురం జిల్లాలో తల్లీ, కూతుళ్ళకు చంద్రబాబునాయుడు ఒకేసారి షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.  తల్లి శమంతకమణేమో ఎంఎల్సీ అయితే కూతురు యామినీ బాల శింగనమల ఎంఎల్ఏగా ఉన్నారు. చంద్రబాబు చేయించుకుంటున్న ప్రతీ సర్వేలోను ఇద్దరికీ చాలా బ్యాడ్ రిమార్కులే వస్తున్నాయట. అంటే కనీసం పాస్ మార్కులు కూడా రాలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. దానికితోడు ఇద్దరి పనీతీరు ఎంత అధ్వాన్నంగా ఉందంటే పార్టీ నేతలే వారి వైఖరితో విసిగిపోయారట. అందుకనే అన్నీ వైపుల నుండి వారిపై బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది. దాంతో తల్లీ, కూతుళ్ళపై చంద్రబాబు దగ్గర బోలెడన్ని ఫిర్యాదులు కుప్ప పడున్నాయి. దాంతో వారి వ్యవహారంపై చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.

శింగనమలలో 2019లో మళ్ళీ యామినికి టిక్కెట్టిస్తే ఓటమి ఖాయమని సర్వే రిపోర్టుల్లో స్పష్టంగా ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందుకని ఈ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో వేరే గట్టి అభ్యర్ధి కోసం చంద్రబాబు చూస్తున్నారు. ఇదే అదునుగా తల్లి శమంతకమణి తన కొడుకును పోటీ చేయించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో కూడా ప్రస్తావించారు. అయితే, సరైన హామీ దక్కలేదనుకోండి అది వేరే సంగతి. ఇంతకీ కూతురు ఎంఎల్ఏగా ఉండగా కొడుకుని పోటీ చేయించాలని తల్లి ఎందుకనుకుంటున్నారు ?

ఎందుకంటే, ఈమధ్యనే ఇద్దరికీ చెడిందట. అంటే బాహాటంగానే ఇద్దరు టిక్కెట్టు విషయంలో గొడవ పడ్డారులేండి. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఎంఎల్ఏ, కూతురు యామిని పట్టుపడుతుండగా ఎలాగైనా కొడుక్కి టిక్కెట్టిప్పించుకోవాలని తల్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగూ కూతురికి టిక్కెట్టు వచ్చే అవకాశం లేదు కాబట్టి అదేదో బయట వాళ్ళకు టిక్కెట్టు జారిపోయేబదులు కొడుక్కే ప్రయత్నాలు చేసుకోవచ్చు కదా అని తల్లి తాపత్రయం. వీళ్ళిద్దరు ఎవరి ప్రయత్నాల్లో వారుండగానే తన మద్దతుదారునికే టిక్కెట్టు ఇఫ్పించుకోవాలని అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి మరోవైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతకీ చంద్రబాబు మనసులో ఏముందో చూడాలి.